ఆడపిల్ల ఆత్మ రక్షణకు కరాటే అవసరమే
పుల్కల్, న్యూస్‌లైన్ : ఆత్మరక్షణకు ఆడపిల్లలకు కరాటే అవసరమంటున్నాడు మండలంలోని వెంకటకిష్టాపూర్ గ్రామానికి చెందిన కొండ్రేపల్లి రమేష్. తనకు మార్షల్ ఆర్ట్స్ అంటే అతనికి ప్రాణమని, ఇష్టంగా కష్టపడి నేర్చుకుని మాస్టర్ అయినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చేస్తూ తాను నేర్చుకున్న విద్యను పది మందికి నేర్పుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ర మేష్. 2007వ సంవత్సరంలో వెంకటకిష్టాపూర్లో ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్‌ఫూ లయన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించిన రమేష్.. 2010లో బ్లాక్ బెల్ట్ పొందాడు.
2011వ సంవత్సరంలో మల్కాజిగిరి సికింద్రాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియన్ టోర్నమెంట్లో బెస్ట్ ఇన్స్‌ఫెయిర్ అవార్డు పొందాడు. 2012లో సికింద్రాబాద్‌లో జరిగిన స్టేట్ లెవల్ టైగర్ కుంగ్‌ఫూలో కటాస్ అవార్డు సాధించాడు. 2013లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డిగ్రీ అందుకున్నాడు. ఇలా అతను మార్షల్ ఆర్ట్స్‌లో ఓ వైపు విజయాలు సాధించుకుంటు మరోవైపు పేద పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చదువుతూ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. అందులో పేద విద్యార్థులు, ఆడ పిల్లలకు ఉచితంగానే కరాటే నేర్పుతున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలో తన వద్ద కరాటే నేర్చుకున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి జోగిపేట సీఐ సైదానాయక్ చేతుల మీదుగా వివిధ విభాగాల్లో బెల్టులను అందించారు.