విజయవాడలో కొనె కార్యాలయం
సాక్షి, అమరావతి: పెద్దనోట్ల రద్దు వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంపై ఎటువంటి ప్రతి కూల ప్రభావం చూపదని ఎలివేటర్, ఎస్కలేటర్స్ సంస్థ కొనె ఇండియా ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో నివాస స్థిరాస్తి రంగంపై మాత్రం తాత్కాలికంగా ప్రభావం పడుతుందని కొనె ఇండియా ఎండి అమిత్ గొస్పైన్ చెప్పారు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించినా ఎలివేటర్ మార్కెట్ మాత్రం 6 శాతం వృద్ధిని నమోదు చేస్తోందన్నారు.
గురువారం విజయవాడలో కొనె కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ’సాక్షి’తో మాట్లాడుతూ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండూ... ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. దేశీయంగా ఎలివేటర్ మార్కెట్ పరిమాణం సుమారుగా రూ. 60,000 కోట్లు ఉంటే ఇందులో 20 శాతం వాటాతో కొనె మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందన్నారు. ఇండియాలో వాస్తు నమ్మకాలు ఎక్కువగా ఉండటంతో దీనికి అనుగుణంగా ఎలివేటర్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు.