మళ్లీ రెచ్చిపోయిన మణిపూర్ ఉగ్రవాదులు
మణిపూర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదుల తూటాలకు ఒక డ్రైవర్ బలయ్యాడు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తరుణిబాలా దేవి అనే మెడికల్ ప్రొఫెసర్ ఉరిపోక్ అనే చోట తన ప్రైవేట్ క్లినిక్ లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. ఆమెను హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఈ సంఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటి వరకూ బాధ్యత వహించలేదు. తరుణిబాల రాజధాని ఇంఫాల్ లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
మరో సంఘటనలో సేనాపతి జిల్లా కాంగ్పాక్ పి ప్రాంతంలో ఉండే మానస్ అలీ అనే 22 ఏళ్ల యువకుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అలీ లారీ డ్రైవర్. అతని యజమానినుంచి ఉగ్రవాదులు 15 లక్షలు డిమాండ్ చేశారు. యజమాని అంగీకరించకపోవడంతో ఫిబ్రవరి 22 న అలీని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
మణిపూర్ లో దాదాపు 40 ఉగ్రవాద సంస్థలున్నాయి. వీటిలో పదిహేను ఉగ్రవాద సంస్థలు అత్యంత ప్రమాదకరమైనవి. గత ఇరవై ఏళ్లలో మణిపూర్ లో ఉగ్రవాద హింసాకాండ 5900 ప్రాణాలను బలిగొంది. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.