koppula hareeshwar reddy
-
తండ్రి వద్దు.. కొడుకు ముద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాజకీయ కురువృద్ధుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయనకు టికెట్ నిరాకరించిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఆయన స్థానే కుమారుడు మహేశ్‌రెడ్డికి టికెట్ ఖాయం చేసింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో టీడీపీని వీడి జిల్లా నుంచి టీఆర్ఎస్లో చేరిన తొలి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరొందిన ఆయన అనూహ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి రామ్మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. గెలిస్తే తెలంగాణ తొలి మంత్రివర్గంలో బెర్త్ లభిస్తుందని అంతా ఊహించారు. అయితే, ఓటమి చెందడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత సీఎంను కలిసిన ఆయనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ దక్కలేదు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆనారోగ్యం బారిన పడ్డ హరీశ్వర్.. నియోజకవర్గ రాజకీయాలకు కొంత దూరం పాటించారు. ఇటీవల పూర్తిసాయిలో కోలుకున్న ఆయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడు మహేశ్‌రెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. స్థానిక సమీకరణలు, హరీశ్వర్‌రెడ్డి రాజకీయ చాణక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన పుత్రుడికి టికెట్‌ను ఖరారు చేస్తూ గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సంస్కృతిని బతికిస్తున్నది రచనే
టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పరిగి: నాటి నుంచి నేటి వరకు సంస్కృతి సంప్రదాయాలను బతికిస్తూ వస్తున్నది రచనలేనని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలోని సత్యసాయి భవనంలో ఏర్పాటు చేసిన సాహితీ సమితి కార్యక్రమంలో వరకవుల జగన్నాధరాజు రచించిన పుండరీక చరిత్ర పద్యనాటకం పుస్తకాన్ని హరీశ్వర్‌రెడ్డితో పాటు ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్ భాస్కరయోగి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ జయరాములు, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ విజయమాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కవి, రంగస్థల నటుడు అయిన పుస్తక రచయిత వరకవుల జగనాధరాజును ఘనంగా సన్మానించారు. ఈ పుస్తకానికి ముందుమాట, ఇతివృత్తాన్ని భాస్కరయోగి వివరించగా ఆచార్యులు డాక్టర్ జయరాములు పుస్తక సమీక్ష గావించారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ..తల్లిదండ్రుల సేవ అన్నింటికంటే గొప్పది.. వారిని విస్మరించరాదనే ఇతి వృత్తంతో పద్యరచన చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. రచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలు, టీవీ షోలు నాటి సంస్కృతి సంప్రదాయాలను మరుగన పడేలా చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు సైతం టీవీ షోలకే బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్ భాస్కర యోగి మాట్లాడుతూ సమకాలీన అంశాలను అద్దంపట్టేలా వరకవుల జగన్నాధరాజు రచన సాగిందన్నారు. ఓ బస్టాండ్‌లో బిచ్చమెత్తుకునే వృద్ధులు తాము అడుక్కుని కొడుకులకు ఇవ్వకపోతే కొడతారని చెప్పిన మాటలకు చలించి ఈ రచన చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. నాటి పుండరీకుని చరిత్రి ప్రస్తుతం తల్లిదండ్రులను హింసించే పిల్లలకు తగ్గట్టుగా సరిపోతుందని తెలిపారు. అనంతరం ఈ పుస్తకాన్ని ప్రముఖ రంగస్థల నటుడు అయిన మాలెల అంజిలయ్యకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ సమితి పెద్దలు, నాయకులు కృష్ణయ్య, శ్రీశైలం, వీరకాంతం, నర్సింహులు, కిష్టప్ప, హన్మంతురెడ్డి, భద్రప్ప, రంగాచారి, నర్సయ్య పాల్గొన్నారు. -
కండువాలు మార్చారు.. కలిసొస్తుందా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ నుంచి ‘హరి’గురి జిల్లాలో అధికంగా తెలుగుదేశం నుంచి వలస పోయారు. వారంతా టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో టీడీపీకి గెలిచే సీన్లేదని డిసైడైన ఆయన కారెక్కారు. స్థానికంగా తెలంగాణ సెంటిమెంటు, దశాబ్ధాలుగా వెన్నంటి నడిచిన అనుచరుల బలంతో మరోసారి శాసన సభ మెట్లెక్కుతాననే ధీమాతో ఉన్నారు. వరుసగా ఎన్నికవుతున్నందున సహజంగానే ప్రజావ్యతిరేకత ఉన్నా.. ఎప్పటికప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న హరీశ్వర్ ఈ సారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంత తీవ్రపోటీని ఎదుర్కొంటున్నారు. మహేందర్‌రెడ్డిదీ అదేదారి టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మరోనేత తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి. ప్రస్తుతం అదే అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశంలో ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి మేనల్లుడే ఈయన. కాలక్రమంలో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా మహేందర్‌రెడ్డి టీడీపీని వీడలేదు. కానీ రాష్ట్రవిభజన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ మునిగిపోయే పడవ అని గుర్తించిన మహేందర్.. గులాబీ గూటికి చేరారు. సహజ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొటున్న ఆయన తెలంగాణ సెంటిమెంటుపైనే ఆశలు పెట్టుకున్నారు. కేఎస్ రత్నం.. మరో యత్నం చేవెళ్ల శాసనసభా స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న కేఎస్ రత్నం కూడా తొలుత పసుపు పార్టీకి చెందినవారే. అనంతరం పలు పార్టీలు మారినా గత ఎన్నికల్లో తిరిగి టీడీపీ నుంచే చేవెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కారులోనే ప్రయాణిస్తున్న ఆయనకు ఎదురీత తప్పడం లేదు. నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభ కొడిగట్టడం, తెలంగాణ వాదం పెరగడం కలిసొచ్చే అంశాలైనా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో కాస్త సహజ వ్యతిరేకత కూడా ఉంది. ఇక చేవెళ్ల స్థానంలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం క్షేత్ర స్థాయిలో బలంగా లేకపోవడం రత్నానికి ఓ ప్రతికూలత. ఈ సారి సెంటిమెంటే గట్టెక్కిస్తుందని గట్టి నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. మైనంపల్లి.. అలా వెళ్లి.. ఇక మల్కాజిగిరి పార్లమెంటుకు టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న మైనంపల్లి హనుమంతురావు కొద్ది రోజుల క్రితం వరకూ టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరి మనిషి. గతంలో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి ఈ సారి కోరిన టికెట్ లభించని కారణంగా వయా కాంగ్రెస్.. గులాబీ గూటికి చేరారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ కోసం పార్టీలు మారిన ఆయన.. చివరికి టీఆర్ఎస్ నుంచి లోక్‌సభ అభ్యర్థి అయ్యారు. ఏ పార్టీ అయినా ఫర్వాలేదు.. మల్కాజిగిరి నుంనే పోటీ చేయాలనే పట్టుదలతో టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నారు. అయితే లోక్‌సభ అభ్యర్థిగా విజయం సాధించడం మైనంపల్లికి కత్తి మీదసామే. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజిగిరిలో తెలంగాణ సెంటిమెంట్ తక్కువ. కేవలం దాన్ని మాత్రమే నమ్ముకుంటే విజయం దక్కదని తెలిసే హనుమంతు అనేక వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. సెటిలర్ల ఎంతో కీలకమైన ఈ స్థానంలో ఎదురీదుతున్న హనుమంతుకు.. తాజాగా టీఆర్ఎస్ కీలక నేతలు సెటిలర్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మరింత తలనొప్పిగా మారింది. అదేవిధంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున పోటీలో ఉన్న చింతల కనకారెడ్డి గత ఎన్నికల్లో పీఆర్పీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి ఆ పార్టీ తరఫున పోటీ చేసినవారే. విజయంపై అనేక లెక్కలు వేసుకుని జెండాలు మార్చిన వీరంతా విజయభావుటా ఎగురవేస్తారో లేదోనన్నది ఎన్నికల ఫలితాలు వెలువడితేగానీ తేలదు. -
ప్రాదేశిక ఎన్నికల్లో మాదే విజయం
పరిగి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ ఊహించని విధంగా ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిగి వల్లభనగర్‌కు చెందిన యువజన సంఘాల నాయకులు యూత్ నాయకుడు పల్లెల ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు జాఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు హర్షద్ టీఆర్ఎస్లో చేరాడు. సాయంత్రం నిర్వహించిన మరో కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నసీరొద్దీన్ మరికొందరు యువకులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. యూత్ నాయకులు జగన్, వెంకటేష్, వీరేష్, శ్రీను, రాజోల్, రమేష్, సన్ని, కృష్ణ, ప్రతాఫ్, నవీన్, మల్లేశ్, శ్రీకాంత్, కిరణ్ తదితర వంద మందికి పైగా యువకులు చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరటంతో టీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టం అవుతుందన్నారు. అందరం కలిసి కట్టుగా పార్టీని ప్రగతి పథంలో నడిపిద్దామని ఆయన తెలిపారు. అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో.. ఇటు సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తాచాటుతుం దని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్, మీర్‌మహమూద్, ప్రవీణ్‌రెడ్డి, ఎర్రగడ్డపల్లి గోపాల్, బషీర్, అనూష, నయీం, హైమద్ఖురేషి, పాండు, అక్రం తదితరులు పాల్గొన్నారు.