అసెంబ్లీ బరిలో ఎంపీ అర్వింద్.. బీఆర్ఎస్ సీనియర్ నేతతో ఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఎంపీలను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాల్సిందేనని బీజేపీ అధిష్ఠానం ఆదేశించడంతో తమకు అనుకూలమైన స్థానంలో బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎంపీ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి.
దీనికితోడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఏళ్లక్రితమే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ, అమిత్‌షాల దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే పునఃప్రారంభించేలా చూస్తానన్న హామీతో ఓట్లు అడిగేందుకు అర్వింద్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
కోరుట్ల నియోజకవర్గంలో పసుపు, చెరుకు పండించే రైతులు అధికంగా ఉండడం.. అటు పసుపుబోర్డు, ఇటు షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అంశం ఎన్నికల్లో కలిసొస్తుందన్న ఆలోచనలో అర్వింద్ ఉన్నట్లు తెలిసింది. గతంలో మెట్పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమించారు. దీంతో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇది కూడా తన గెలుపునకు దోహదపడుతుందని, ఆర్మూర్‌తో పోలిస్తే కోరుట్లలోనే విజయం సాధించడం సులువనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.