ముంచుకొస్తున్న కోసీ.. నాలుగు జిల్లాలు ఖాళీ
కోసీ నది వరద భారీ స్థాయిలో ముంచుకుని వస్తుండటంతో దాని ఒడ్డున ఉన్న నాలుగు జిల్లాల ప్రజలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేపాల్‌ను ఇప్పటికే అతలాకుతలం చేసిన కోసీనది వరద శనివారం రాత్రికల్లా బీహార్‌ను కూడా ముంచెత్తుతుందని వాతావారణ శాఖ హెచ్చరించింది. ఇది అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని బీహార్ విపత్తు నివారణ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యాస్జీ తెలిపారు. సుపాల్, సహర్సా, మాధేపురా, మధుబని జిల్లాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
గతంలో ఎన్నడూ లేనట్లుగా ఏకంగా పది మీటర్ల ఎత్తున కోసీనది వరద వస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపిందని, దారిలో ఉపనదులతో కలిసి ఇది మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని వ్యాస్జీ అన్నారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. సుపాల్ పట్టణంలో నీటిమట్టం చాలా ఎక్కువగా వచ్చేలా ఉందని, ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడం కూడా అత్యంత కష్టమని ఆయన అన్నారు.
గతంలో 2008లో కూడా కోసీ నది ఉధృత రూపం దాల్చడంతో బీహార్‌లో భారీ నష్టం సంభవించింది. అప్పట్లో కూడా ఆగస్టు నెలలోనే 18వ తేదీన నేపాల్ నుంచి తీవ్రస్థాయిలో వరద రావడంతో కోసీ నది గట్లు తెగిపోయాయి. దాంతో వందలాది మంది మరణించగా, దాదాపు 30 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 8 లక్షల ఎకరాల్లో పంట సర్వనాశనం అయ్యింది.