విధి వంచన
గంటల వ్యవధిలో తల్లి కొడుకుల మృతి
అనాథలైన కుటుంబం
గ్రామంలో విషాద ఛాయలు
రామభద్రపురం(బొబ్బిలి):
ఆ తల్లి నవ మాసాలు మోసి కన్న కొడుకు విఘత జీవుడై ఉండడాన్ని చూసి తట్టుకోలేక పోయింది. కొడుకు లేని లోకంలో ఇంక ఉండలేను అనుకుంది. కన్న కొడుకు నిర్జీవంగా కళ్లదుటే పడి ఉండడాన్ని తట్టుకోలేక పోయింది. కుమారుడు మృతదేహంపై గుక్కపట్టి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అంతే గంటల వ్యవధిలో ఓ కుటుంబం రోడ్డున పడింది. గంటల వ్యవధిలో తల్లిబిడ్డలు ఇద్దరూ ఒకరి వెంట ఒకరు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. ఇది చూసిన స్థానికులు, బంధువుల కళ్లలో కన్నీళ్లు చెమర్చాయి. తండ్రి, నానమ్మ లేడని పిల్లలు, భర్త, అత్త ఇక కనిపించరని ఆ ఇల్లాలు రోదిస్తున్న తీరును చూసి అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. రామభద్రపురం మిర్తివలస గ్రామానికి చెందిన కోట ఈశ్వరరావు(42) తాపీ పని చేస్తుంటారు. రోజులాగే పని చేసుకుని ఆదివారం కూడా ఇంటి కి చేరుకున్నారు. భా ర్య పిల్లలతో సరదాగా గyì పి రాత్రికి వారితో కలిసి మేడపై పడుకున్నారు. ఎప్పు డూ వేకువ జాము 5 గంట లకే అందరి కంటే ముందు లేచి మిగిలిన వారి లేపి కిందకి దించే ఆయన ఎప్పటికీ లేవకపోవడంతో పిల్లలు, ఇల్లాలు వెళ్లి లేపి చూశారు. ఎప్పటికీ లేవకపోవడంతో చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. చుట్టుపక్కల వారిని పిలిచి ఆయన మృతదేహాన్ని మేడపై నుంచి కిందికి దించారు.
కొడుకుతో పాటే తల్లి కూడా..
ఈశ్వరరావు శవాన్ని కిందికి దించిన తర్వాత ఆయన తల్లి గంగమ్మ విషయం తెలుసుకుని కొడుకు మృతదేహంపై పడి బోరున ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు అయ్యాక హఠాత్తుగా కుమారునిపై కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే సాలూరు సీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. అక్కడి వైద్యులు ఆక్సిజన్ పెట్టి మెరుగైన వైద్యం కోసం విజయనగరానికి రెఫర్ చేశారు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గంగమ్మ (65) చనిపోయారు. ఈశ్వరరావుకు భార్య సత్యవతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారంతా ఇద్దరి మృతితో అనాథలు అయ్యారు.