పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
కోట : పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడంపై నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాలు... గూడలి గ్రామానికి చెందిన గంటా జనార్దన్(40)ను బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, జనార్దన్ పోలీస్ స్టేషన్లోనే మృతి చెందాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే అతడు మరణించాడని బంధువులు, గ్రామస్తులు ఆదివారం ఉదయం కోట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. డీఎస్పీ వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.