మిగులు సొమ్ము మింగేశారు
♦ పింఛన్ల డబ్బులు కాజేసిన మున్సిపల్ కమిషనర్
♦ నిలదీసిన కౌన్సిలర్లకు సమాధానం చెప్పలేక పరుగులు
♦ మున్సిపల్ సమావేశ మందిరంలో గందరగోళం
కాశీబుగ్గ:
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందించే పింఛన్ల సొమ్ములో అవినీతి జరిగింది. మున్సిపల్ కమిషనరే పింఛన్ల సొమ్మును కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయట పడడంతో లెక్కలు చెప్పాల్సిన కమిషనర్ పరుగులు పెట్టారు. నిండు సమావేశంలో లెక్కలు చెప్పాల్సి రావడంతో చెప్పలేక అక్కడ నుంచి జారుకున్నారు. ఉద్యోగులు, కౌన్సిలర్లు ఉండమంటున్న ఉండకుండా కమిషనర్ సమావేశ మందిరం నుంచి తలుపుతీసి పరుగున వెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అధ్యక్షతన ఉద్యోగుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పింఛన్ల పంపిణీపై జరిగిన చర్చలో మున్సిపల్ కమిషనర్ పిల్ల జగన్మోహన్రావు అవినీతి భాగోతం బయటపడింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పలాస మున్సిపాలిటీ పరిధిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 2701 మందికి జూన్‌లో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే సుమారు 450 మందికి పింఛన్లు పంపిణీ చేయలేదు. ఇందులో 262 మందికి వేలుముద్రలు పడలేదు. ఈ తరుణంలో రూ. 46.39 లక్షలకు, రూ. 1.39 లక్షలు విత్‌డ్రా చేయలేదు. మిగిలిన నిధులు డ్రాచేశారు. దీంతో పాటుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో వీఆర్ఏ శారద పింఛన్లు పంపిణీ చేసి రూ. 15 వేలు మిగులు పింఛన్ డబ్బులను కమిషనర్ సమక్షంలో జగ్గం శ్రీనుకు అప్పగించగా, మహేష్‌కు రూ. 5 వేలు ఇవ్వమని కమిషనర్ తెలిపారు.
ఇంకో పింఛన్ పంపిణీదారురాలు మోనీస నుంచి రూ. 5 వేలు కమిషనర్ తీసుకున్నారు. అలాగే మెప్మా విభాగం కో–ఆర్డినేటర్ స్వప్న రూ. 30 వేలు మిగులు పింఛన్ సొమ్మును కమిషనర్‌కు అందజేశారు. ఇలా మొత్తం రూ. 50 వేలు మిగులు పింఛన్ డబ్బులు బ్యాంకులో వేసినట్టు చెప్పి, రూ. 25 వేలకు సంబంధించిన రశీదు మాత్రమే చూపిస్తున్నారు. మిగిలిన రూ. 25 వేలు ఏమయ్యాయని ఉద్యోగులు, కౌన్సిలర్లు సమావేశంలో కమిషనర్‌ను నిలదీయగా రెవెన్యూ సిబ్బంది జగ్గం శ్రీనుకు అందజేశానని తెలిపారు. జగ్గం శ్రీను వెంటనే లేచి నాకు ఇవ్వలేదని, ఇది పచ్చి అబద్ధమని తెలపడంతో కమిషనర్ మాటమార్చి మెప్మా సీవో స్వప్నకు అందజేశానన్నారు. మెప్మా సీవో స్వప్న వెంటనే లేచి నాకు ఇవ్వలేదని, నా పేరు అనవసరంగా చెబుతున్నారని, మిగులు పింఛన్ డబ్బులు నేనెప్పుడో చెల్లించానని ఆమె తెలిపింది.
దీంతో చేసేది లేక, రూ. 25 వేలుకు లెక్కలు చెప్పలేక అక్కడున్న డైరీలు, పుస్తకాలు పట్టుకొని కమిషనర్ సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, కౌన్సిలర్ పాతాళ ముకుందరావు, కౌన్సిలర్ ప్రతినిధులు బడగల బాలచంద్రుడు, బళ్ల శ్రీనివాసరావు, బుల్లు ప్రధాన్, కోఆప్సన్ సభ్యులు భానుమూర్తి, కౌన్సిలర్ చంద్రవతి వెళ్లవద్దని కమిషనర్‌ను కోరుతున్నప్పటికీ సభ మధ్యలో సభ్యులను తిరస్కరించి తలుపు తీసి పరుగులు తీశారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 2.40 లక్షలు మిగులు పింఛన్ డబ్బులు తిరిగి జమ కాలేదని, పింఛన్లు అందక 25వ వార్డు నుంచి 26 మంది వితంతు, వికలాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు సభలో ప్రస్తావించారు.