బ్రాహ్మణుల మద్దతు వైఎస్సార్ సీపీకే
‘బ్రాహ్మణ సేవా సంఘ’ అధ్యక్షుడు శంకరశర్మ
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్ : బ్రాహ్మణుల మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకేనని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోట శంకరశర్మ ప్రకటించారు. గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులకు రాజకీయంగా సముచిత గౌరవం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాపట్ల అసెంబ్లీ సీటును కోన రఘుపతికి కే టాయించినందున వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలని అన్ని జిల్లాల బ్రాహ్మణ సంఘాలకు వర్తమానం పంపనున్నట్లు వెల్లడించారు. బ్రాహ్మణులంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రత్యేక అభిమానం ఉండేదని గుర్తు చేశారు. అర్చకుల అభ్యున్నతికి, ఆలయాల్లో నిత్యథూపదీప నైవేద్యాలు జరిగేలా కూడా రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకున్నారని కోట శంకరశర్మ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించేందుకు రాజశేఖరరెడ్డి గతంలో హామీ ఇచ్చారని, ఆయన అకాల మృతితో ఆ హామీ నెరవేరలేదని విచారం వ్యక్తం చేశారు. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి బహిరంగ మద్దతు ప్రకటించనున్నట్లు చెప్పారు.
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జగన్‌ను కోరనున్నట్లు కోట శంకరశర్మ ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు తమ ఓటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.