నాన్న నువ్వే రైట్.. నాకు బతకాలని లేదు!
కోటా: డాక్టర్ కావాలని కలలు కన్న ఓ విద్యార్థి ఒత్తిడి తాళలేక అర్ధంతరంగా తనువు చాలించాడు. 'నువ్వైనా బాగా కష్టపడి అమ్మనాన్నల ఆకాంక్షలు నెరవేర్చు' అంటూ తన తమ్ముడు 'ఛోటు' కోసం ఓ వీడియో మెసేజ్ పెట్టి.. చంబల్ నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ కోటాలోని హ్యాంగింగ్ బ్రిడ్జి వద్ద గురువారం చోటుచేసుకుంది.
బిహార్‌లోని రాధోపూర్కు చెందిన 16 ఏళ్ల అమన్ గుప్తా కోటాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో ఇంటర్ ఫస్టియర్ (11వ తరగతి) చదువతున్నాడు. అదేసమయంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం ఉద్దేశించిన ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. దేశంలోనే కోచింగ్ సెంటర్లకు పేరొందిన కోటాలో ఓ గదిలో అద్దెకు ఉంటూ అతను చదువు కొనసాగిస్తున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు గదినుంచి బయలుదేరిన అమన్.. స్నేహితులకు ఫోన్ చేసి తన నిర్ణయం గురించి చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చి.. సంఘటనా స్థలంలోకి చేరుకునేలోపే సెల్‌ఫోన్ లో ఓ వీడియో తీసి.. చంబల్ నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు అతని సెల్‌ఫోన్‌ను ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
'నాన్న చెప్పింది కరెక్టే. నేను చదువుల్లో ఎప్పుడు రాణించలేను. నాన్నా మీరు నాకెప్పుడూ మద్దతిచ్చారు. కానీ నేనే మీరు సిగ్గుపడేలా చేశాను. పదో తరగతిలోనూ నాపై ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు అందింది. నేను జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నా స్నేహితులు, ప్రతి ఒక్కరు నాకు సాయపడ్డారు. అయినా నేను సరిగ్గా చేయలేకపోతున్నా. నా కోసం ఎవరూ ఏడ్వొద్దు. ఏ కారణం లేకున్నా ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు బతకాలని లేదు. ఛోటు (తమ్ముడు) నువ్వు బాగా కష్టపడి అమ్మనాన్నల ఆకాంక్షలు నెరవేర్చు..' అని 11.14 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అమన్ భావోద్వేగంగా పేర్కొన్నాడు. అమన్ చాలా తెలివైన విద్యార్థి అని, టెస్టుల్లో 80శాతానికిపైగా మార్కులు తెచ్చుకునేవాడని కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు చెప్తున్నారు. దేశంలోనే కోచింగ్ సెంటర్లకు పేరొందిన కోటాలో ఏటా ఎంతోమంది విద్యార్థులు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 14మంది విద్యార్థులు ఇక్కడ తనువు చాలించారు.