'కోటి' కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
తిరుపతి: ప్రత్యేక హోదా కోసం ఆత్మ బలిదానం చేసుకున్న బీఎంకే కోటి కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు. సోమవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ప్రత్యేక హోదా కోసం పార్టీ ఎంపీలు, ఎమ్మేల్యేలు, ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి జగన్మోహన్రెడ్డి ధర్నా చేయనున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటారు.
అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని కోటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరుపతిలో సోమవారం సాయంత్రం జరిగే కోటి అంత్యక్రియలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి హాజరు కానున్నారు. సోమవారం నాటి ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరిన కరుణాకరరెడ్డి హుటాహుటిన తిరుపతికి తిరుగు పయనమయ్యారు.