సమైక్య ముసుగులో సీఎం రాజకీయాలు:జగన్
చిత్తూరు: సమైక్య ముసుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కొత్తపల్లిమిట్ట గ్రామం చేరుకున్న జగన్ అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని సీఎం అసెంబ్లీలో తీర్మానాన్ని ఇంతవరకు పెట్టడం లేదన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అడ్డగోలుగా లేఖ ఇచ్చారని చెప్పారు. సమైక్య లేఖ ఇవ్వడానికి ఆయన ఇప్పటి వరకు ముందుకు రాలేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, సిఎం కిరణ్, చంద్రబాబు ముగ్గురూ కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం మధ్య నేడు యుద్ధం జరుగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధానిని చేద్దాం అన్నారు.
ఇదిలా ఉండగా, కొత్తపల్లిమిట్టలో అభిమానులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు రెండు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు ఒక విగ్రహానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. నాలుగు అడుగుల స్థలం కోసం అనుమతి కావాలా? అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ అనే వ్యక్తి లేకుంటే ఈ ప్రభుత్వం ఉండేది కాదని చెప్పారు. భూస్థాపితం అయ్యే కాంగ్రెస్కు ప్రాణం పోసింది వైఎస్ఆర్ అన్నారు. అటువంటి వ్యక్తి విగ్రహ ప్రతిష్టకు అనుమతులంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.