ఉపాధికి ఊతం
హుదూద్‌తో కొత్తపనుల గుర్తింపు
పెద్దఎత్తున కల్పనకు ప్రణాళిక
రైతులకు మేలు
సాక్షి, విశాఖపట్నం : హుదూద్ తుపాను ఉపాధి హామీ కూలీలకు ఊతమిస్తోంది. హుదూద్ సృష్టించిన విధ్వంసంతో పెద్ద ఎత్తున పనుల కల్పనకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హూదూద్ తుపానుకు పదిరోజుల ముందు వరకు ఉపాధి హామీ కూలీలకు రోజూ పాతికవేల పనిదినాలు కల్పించేవారు. ఒక పక్క వ్యవసాయ సీజన్..మరొక పక్క హూదూద్ దెబ్బతో ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఒక్క పనిదినాన్నికూడా కల్పించ లేని పరిస్థితి.
రానున్న సీజన్లో చేపట్టనున్న పనుల కోసం ప్రణాళిక రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా హూదూద్ విధ్వంసంతో ఉత్తరాంధ్రలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైతులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా రైతులను ఆదుకునే లక్ష్యంతో కొత్త పనుల గుర్తించారు.
వీటిలో ప్రధానంగా తుపానునేపథ్యంలో పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలు తొలగించడం, ధ్వంసమైన పొలం గట్లు, వరదగట్లు పటిష్టపరచడం, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ ఛానల్స్‌లో పేరుకుపోయిన డీసిల్టింగ్ తొలగింపు, పొలాల్లో నేలకొరిగిన చె ట్లు తొలగింపు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తోటలు.. పొలాల గట్లపై పడిపోయిన చెట్ల స్థానే కొత్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఉపాధి హామీలో చేపట్టాలని యోచిస్తున్నారు. మామిడి, జీడి, సపోటా, కొబ్బరి తదతర వాణిజ్య పంటలన్నీ హార్టికల్చర్ ప్రొగ్రామ్ ద్వారా రైతుల తోటల్లో ఉపాధి హామీ పథకంలో నాటనున్నారు.
ప్రస్తుతం ఎన్యూమరేషన్ జరుగుతున్నందున..అది పూర్తి కాగానే ఎన్ని వేల ఎకరాల్లో తోటలు, పొలాల్లో చెట్లు నేలమట్టమయ్యాయో అంచనా వేసి తొలుత వాటిని తొలగించడం..ఆతర్వాత రైతుల సమ్మతితో కూలీలద్వారా వారు సాగు చేసే రకాలకు చెందిన మొక్కలను పెద్ద ఎత్తున నాటేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన మొక్కలను ఉద్యానవనశాఖ సరఫరా చేస్తుంది. ఉపాధి కూలీల ద్వారా రైతుల పొలాలు, తోటల్లో వాటిని నాటించనున్నారు.
హూదూద్ నేపథ్యంలో ఉపాధి హామీ అధికారులు గుర్తించిన పనుల ఆమోదం కోసం జిల్లా కలెక్టర్ యువరాజ్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త పనులతో సంబంధం లేకుండా గతంలో ప్రతిపాదించిన రూ.400కోట్ల విలువైన పనులకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం చేపడుతున్న ప్లానింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వీటిని కూడా చేపడతామని జిల్లాడ్వామా పీడీ శ్రీరాములునాయుడు సాక్షికి తెలిపారు.