జోరుగా క్యాట్‌ఫిష్ అమ్మకాలు
ఆ చేపలపై కొనసాగుతున్న నిషేధం
అధికారులు పట్టించుకోవడం లేదని యువజన సంఘాల ఆరోపణ
కౌడిపల్లి: ప్రజారోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపే నిషేధిత క్యాట్ ఫిష్ (మార్పులు)ను జోరుగా అమ్ముతున్నారు. కౌడిపల్లిలో గురువారం జరిగిన అంగడిలో మంజీర నది పరివాహక ప్రాంతం జోగిపేట, కొల్చారం, పాపన్నపేట ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి విక్రయించారు. అత్యంత కుళ్లిపోయిన జీవరాసుల కళేబరాలను సైతం తిని జీర్ణించుకునే శక్తి క్యాట్‌ఫిష్‌లకు ఉంటుంది.
దీంతో వాటిలోని విష పదార్థాలు అలాగే ఉండటం వల్ల వాటిని తిన్నటువంటి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో వ్యాధుల బారిన పడతారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కౌడిపల్లి అంగడిలో నాలుగైదు వారాలుగా ఒకరిద్దరుగా వచ్చిన వ్యాపారులు అమ్మకాలు నిర్వహించారు. కాగా గురువారం మాత్రం ఏకంగా ఏడుగురు వ్యాపారులు సంచుల్లో క్వింటాళ్లకొద్ది క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి అంగడిలో అమ్మారు. ఒక్కో చేప సుమారు 3 నుండి 5 కిలోల వరకు ఉండగా రూ. 200 నుండి 300 వందలకు గుత్త లెక్కన అమ్మకాలు చేపట్టారు.
ఈ చేపల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలియని ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు చెబుతున్నారు. కాగా క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న గ్రామానికి చెందిన యువజన సంఘం సభ్యులు దుర్గేష్, సుధాకర్, కిషోర్‌గౌడ్‌లు తాము పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చేపల వ్యాపారులు కౌడిపల్లితోపాటు నర్సాపూర్, పోతన్షెట్టిపల్లి, జోగిపేట, రంగంపేట తదితర అంగళ్లలో క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు సమాచారం.