బొమ్మ కాదు... బొరుసు కాదు..!
సమాజంలో హిజ్రాలకు ఎదురవుతున్న సమస్యలను ప్రధానాంశంగా చేసుకుని కేపీ లక్ష్మయ్యచారి నిర్మిస్తున్న చిత్రం ‘థర్డ్ మేన్’. ఇంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాణక్క పాత్రను పృథ్వీ చేశారు. ‘బొమ్మకాదు బొరుసు కాదు’ అనేది ఉపశీర్షిక. బొంబాయి భోలే స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘అందరితో పాటు హిజ్రాలకు సమాన హక్కులు ఉంటాయని చాలామందికి తెలియదు. కానీ, దేశంలో వారికి ఎక్కడా స్వతంత్రం లేదు. త్వరలోనే వారికి పూర్తి స్వేచ్ఛ దక్కుతుందని ఆశిస్తున్నా’’ అని పృథ్వీ చెప్పారు. వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రం ఇదని, నిజమైన హిజ్రాలు కూడా నటించారని దర్శక, నిర్మాతలు అన్నారు. ఇందులో కంట తడిపెట్టించే సన్నివేశాలుంటాయని సంభాషణల రచయిత ఘటికాచలం చెప్పారు.