అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలి
వైఎస్సార్ సీపీ నేత కె.పార్థసారథి
సాక్షి, విజయవాడ : రైతులు ఉద్యానవన పంటలు, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ తదితర అనుబంధ రంగాల కోసం తీసుకున్న రుణాలనూ ప్రభుత్వం మాఫీ చేయాలని వైస్సార్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి కె.పార్థసారథి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీతారాంపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 68వ స్వాతంత్య్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సారథి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ రైతు రుణాలను మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి రైతులు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకోవాలని, అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు పండకపోయినా రైతుల్ని అనుబంధ రంగాలు ఆదుకుంటాయని చెప్పి, ఆ రంగాలకు కావాల్సిన రుణాలను ఇప్పించారని గుర్తు చేశారు.
చంద్రబాబు రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ చెల్లిస్తారనే ఆశతో అనేక మంది రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేదన్నారు. దీనివల్ల వారు వడ్డీ రాయితీ, సబ్బిడీ కోల్పోయారని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నా, లేకపోయినా రైతులు తీసుకున్న రుణాలు ఆధారంగా రైతు రుణమాఫీ చేయాలన్నారు. ప్రభల శ్రీనివాస్, ఎంఎస్బేగ్, నారుమంచినారాయణ, ఎం.ఎస్.నారాయణ, జ్యోతిరెడ్డి, బొట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.