‘ఉగ్ర' భూతాన్ని తరిమేద్దాం
యాంటీ టైజమ్ డే
- సీఎం సిద్ధరామయ్య సహా విధానసౌధ ఉద్యోగుల ప్రతిజ్ఞ
- కేపీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి
- నివాళి అర్పించిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్
సాక్షి, బెంగళూరు: ‘‘ఉగ్రభూతాన్ని తరిమేసేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులవుదాము’’ అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రులు కె.జె.జార్జ్, రామలింగా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీతో పాటు ఇతర ఐఏఎస్ అధికారులు, విధానసౌధ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. యాంటీ టైజమ్ డే సందర్భంగా గురువారమిక్కడి విధాన సౌధలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారుల తో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు.
ఏడాదిలో ఏం చేశారు?
నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ విమర్శించారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఈనెల 26కు ఏడాది పూర్తవుతుందని, అయితే ఈ ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నరేంద్రమోదీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ రహిత దేశంగా భారత్‌ను మారుస్తానంటూ నరేంద్రమోదీ కలలు కంటున్నారని, అయితే భారతదేశంలో కాంగ్రెస్‌ను లేకుండా చేయడం ఎవరి వల్లా కాదని పరమేశ్వర్ పేర్కొన్నారు. 129 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరో 129 ఏళ్లు, అంతకంటే ఎక్కువగానే దేశంలో తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పరమేశ్వర్ అన్నారు. ఇక విదే శాల పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోదీ అక్కడ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇక ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించి సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని మరి కొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించిన నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఇందుకు సంబంధిం చిన వదంతులపై తాను స్పందించలేనని పేర్కొన్నారు.