మోటిఫ్ నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బీపీవో, కేపీవో సంస్థ మోటిఫ్ వచ్చే మూడు నెలల్లో 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల నియామకం కోసం హైదరాబాద్ వంటి పట్టణాల్లో రోడ్ షోలతోపాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నుట్లు మోటిఫ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) సంజయ్ సాహ్ని తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఈ కేంద్రం నుంచి కనీసం 40 నుంచి 50 మందిని తీసుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ప్రారంభ వేతనం(సీటీసీ) నెలకు రూ. 18,000 నుంచి రూ. 21,000 వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్ కేంద్రంలో 1,500 మంది పనిచేస్తున్నారని, అక్కడ సిబ్బంది 2,000 దాటితే మరో నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం మోటిఫ్ అమెరికా, ఫిలిఫ్పైన్స్లలో కేంద్రాలున్నాయి. ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రూ. 100 కోట్ల మార్కును అందుకొందని, ఈ ఏడాది వ్యాపారంలో 20% వృద్ధిని అంచనావేస్తున్నట్లు సాహ్ని తెలిపారు.