కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల పరీక్షలో జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? అత్యధిక మార్కులు సాధించడం ఎలా?
- కె.ప్రియదర్శిని, జూబ్లీహిల్స్
ఎస్బీఐ గ్రూప్ మినహాయించి మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) అక్టోబరులో ఉమ్మడి రాతపరీక్షను నిర్వహించనుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఇప్పటివరకు ఐబీపీఎస్ నిర్వహించిన మూడు పీవోస్ పరీక్షలను పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ రంగం విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు గమనించవచ్చు. స్టాక్ జీకే నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్‌లో సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను చదవాలి. ప్రభుత్వ పథకాలు, వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు, ముఖ్యమైన దినోత్సవాలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, క్రీడలు - క్రీడాకారులు- ఇటీవల జరిగిన క్రీడల కప్‌లు, టోర్నమెంట్లు, ఆర్థిక విషయాలు, ప్రణాళికలు, అబ్రివేషన్స్, అంతర్జాతీయ సంస్థలు - ప్రధాన కార్యాలయాలు, సదస్సులు, పుస్తకాలు - రచయితలు, దేశీయ, అంతర్జాతీయ సంఘటనలు, దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, భారత అంతరిక్ష పరిశోధనలు - ఇటీవలి విజయాలు, దేశ రక్షణ వ్యవస్థ, క్షిపణులు, కమిటీలు - చైర్మన్లు మొదలైన వర్తమాన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ - తాజా పరపతి విధానాలు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, కొత్త బ్యాంకుల ఏర్పాటు, ఆర్బీఐ ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు - అధ్యక్షులు, ఆ కమిటీల సిఫారసులు, ప్రస్తుత పాలసీ రేట్లు, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, ముఖ్యమైన బ్యాంకుల అధిపతులు, బ్యాంకింగ్ పదజాలం, డిపాజిట్లు - వాటి రకాలు, నాబార్డ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఏటీఎంలు, చెక్కులు, కేవైసీ (నో యువర్ కస్టమర్) విధానాలు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లాంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
స్టాక్ జీకేకు సంబంధించి దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంట్లు, క్రీడలకు సంబంధించిన ట్రోఫీలు, పదజాలం, అభయారణ్యాలు - అవి ఉన్న రాష్ట్రాలు, రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు లాంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. అందువల్ల పరీక్షలో ఈ విభాగాన్ని మొదటగా పూర్తిచేసి, ఎక్కువ సమయం తీసుకునే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాంటి విభాగాలను చివర్లో చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే రోజూ ఒక దినపత్రికను చదివి నోట్స్ రూపొందించుకోవడం తప్పనిసరి. దీంతోపాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్‌ను చదవాలి. ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝలో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అభ్యర్థులకు బాగా ఉపకరిస్తాయి.