నేను కరెక్ట్‌గానే ఉన్నా
కేపీఎస్సీ-11 నియామకాల రద్దుపై సీఎం
ఉప ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా
సాక్షి, బళ్లారి : కేపీఎస్సీ-11 నియామకాల రద్దుపై తాను కచ్చితంగా వ్యవహరిస్తున్నానని, తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. పనిపాట లేక మాజీ సీఎం కుమారస్వామి ఈ విషయాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం మాజీ ఎమ్మెల్యే నారా సూర్య నారాయణరెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
2011 సంవత్సరంలో జరిగిన కేపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సీఐడీ నివేదిక ఇవ్వడంతోనే నియామకాలు రద్దు చేసిననట్లు ప్రకటించామని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని వేసుకునే వచ్చే నేతలను ఏమనాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో బళ్లారితో పాటు సదలిగి, శికారిపుర ఉప ఉన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. బళ్లారిలో కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని, దీనికితోడు బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి పార్టీలోకి చేరడం అభ్యర్థుల విజయవకాశాలను మెరుగు పరుస్తుందన్నారు.
బోరుబావిలో పడిన బాలుడు తిమ్మణ్ణను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు. దురదృష్టవశాత్తు బాలుడు ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఈ ఘటనకు సంబంధించి సస్పెండ్ అయిన అధికారులను తిరిగి నియమించే విషయమై పోలీసుల నివేదిక అందిన తర్వాత పరిశీలిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వర, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.