తెలంగాణకు ఇదేం అన్యాయం?
కార్యకలాపాల ఆధారంగా {sాన్స్కో పోస్టులను విభజించాలి: టీజాక్
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ రంగానికి అదే అన్యాయం కొనసాగుతోందని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (టీజాక్) మండిపడింది. ట్రాన్స్‌కోలో ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన కాకుండా కార్యకలాపాల ఆధారంగా విభజించాలని టీజాక్ కో-ఆర్డినేటర్ కె. రఘు డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన విభజించడం వల్ల పోస్టుల్లో తెలంగాణకు కేవలం 42 శాతమే వచ్చిందన్నారు. విద్యుత్ సరఫరా లైను పొడవు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య, విద్యుత్ డిమాండ్ ఆధారంగా విభజిస్తే 53 శాతం వస్తుందన్నారు.
తెలంగాణకు కేవలం 42 శాతం చేయడం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయి అనేక విభాగాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులైన మాచ్‌ఖండ్, బలిమెల, టీబీ డ్యామ్‌లకు సంబంధించిన ఆస్తులను సీమాంధ్రలో కలుపుతూ ఉత్తర్వులివ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను సీమాంధ్ర ప్రాజెక్టులుగా పరిగణించడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. వీటి ఆస్తులపై రెండు రాష్ట్రాలకూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటిపై న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌తో పాటు గవర్నరు సలహాదారులను కూడా కలవనున్నట్టు ఆయన పేర్కొన్నారు.