అయోమయంలో ‘ఆమ్ ఆద్మీ’
‘రాజకీయపార్టీగా ఒకసారి ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత బరిలోంచి తప్పుకోవడం సబబు కాదు. ఎందుకంటే హర్యానాలో మాకు
5 లక్షల మంది ప్రజల మద్దతు ఉంది. ఇప్పుడు వాళ్లకు మేమేం సమాధానం చెప్పాలి’ అన్నది యోగేంద్ర యాదవ్ ప్రశ్న.
ఆమ్ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గతంలో చేసిన తప్పుల నుండి బయటపడటానికి బదులు మరో తప్పు చేయడానికి సిద్ధపడుతున్న సూచనలు కనబడుతున్నాయి. బలమున్న చోట పోటీ చేయకుండా, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా గతంలో పార్టీ అవకాశాలను కేజ్రీవాల్ దెబ్బతీశారు. అలాంటిది ఇప్పుడు ఢిల్లీ పీఠంపైనే కేంద్రీకరించి ఇతర రాష్ట్రాల్లో పార్టీ అవకాశాలను దెబ్బతీసే క్రమంలో పయనిస్తున్నారా? హర్యానా పార్టీ శాఖలో జరుగుతున్న పరిణామాలు దీన్నే సూచిస్తున్నాయి. అక్కడ ఎన్నికల్లో పోటీ చేయొద్దని, పార్టీ యావత్తూ ఢిల్లీపైనే కేంద్రీకరించాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే పార్టీ మళ్లీ గెలుస్తుందో లేదో చెప్పటం కష్టమే. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో అవకాశాలను పణంగా పెడుతున్నారు. హర్యానాలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఘోర పరాజయం పొందినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో 90 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ జనవరిలో ప్రకటించింది. ఈ ధీమాకు కారణాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఆ ప్రభావం ఈసారి హర్యానాపై కూడా ఉంటుందని, అక్కడా గెలుపు సాధిస్తామని పార్టీ శ్రేణుల విశ్వాసం. ఇది అతి అంచనాయే కావచ్చు. కేజ్రీవాల్ ప్రకటనతో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నామని రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయిష్టంగానే తీర్మానించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై జాతీయ నాయకత్వంలోనే ఏకాభిప్రాయం కుదరలేదు. భిన్నాభిప్రాయాలతో ఎన్నికలకు వెళ్లడం కంటే ఈ సారికి ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించుకుంది. ఈ పరిణామం ఆ రాష్ట్ర పార్టీ కార్యకర్తలనే కాకుండా నాయకత్వాన్ని కూడా నిరాశపర్చింది. ఆప్ కీలక నేత యోగేంద్ర యాదవ్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘రాజకీయపార్టీగా ఒకసారి ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత బరిలోంచి తప్పుకోవడం సబబు కాదు. ఎందుకంటే హర్యానాలో మాకు 5 లక్షల మంది ప్రజల మద్దతు ఉంది. ఇప్పుడు వాళ్లకు మేమేం సమాధానం చెప్పాలి’ అన్నది ఆయన ప్రశ్న. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్న కేజ్రీవాల్ అనతికాలంలోనే దాన్ని పోగొట్టుకున్నారు. దీనికి కాంగ్రెస్, బీజేపీల కంటే కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే ఎక్కువ. కాంగ్రెస్ మద్దతుతోనే సీఎం పీఠమెక్కినప్పటికీ దాన్నీ, బీజేపీనీ ఇరికించే ప్రయత్నంలో కేజ్రీవాలే ఊబిలో కూరుకుపోయారు. సీఎం పీఠం పోవడంతో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా సిఫార్సు చేసి భంగపడ్డారు. ఆ తర్వాత కూడా కేజ్రీవాల్ వ్యూహం తప్పటడుగులతోటే నడిచింది. ఢిల్లీలో అధికారం మరోసారి దక్కే అవకాశం కనిపించడం లేదు. అయినప్పటికీ ఢిల్లీ రాజకీయాలనే నమ్ముకుని ఇప్పుడు రాష్ట్రాల్లో తనకు కొద్దోగొప్పో బలమున్న చోట్ల కూడా అవకాశాలను వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇలా కేజ్రీవాల్ తాను సృష్టించిన పార్టీకే నష్టకరంగా మారుతున్నారనిపిస్తుంది. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయకుండా సానుభూతి పరుల మద్దతుతోనే రాజకీయాల్లో నిలబడటం ఏ పార్టీకైనా ఆత్మహత్యా సదృశమే.
కె.రాజశేఖరరాజు