ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా
నెల్లూరు(హరనాథపురం) : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా వ్యాప్తంగా ప్రాంతీయ రవాణా అధికారి కె.రాంప్రసాద్ ఆధ్వర్యంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆరు బృందాలుగా ఏర్పడి శుక్రవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ఫిట్నెస్ లేని 18 బస్సులను సీజ్ చేశారు. నెల్లూరు నగరంలో ఎఫ్సీ గడువు ముగిసిన 15 బస్సులను సీజ్ చేశారు. గూడూరులో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా నెల్లూరులో మరో మూడు బస్సులపై కేసులను నమోదు చేశారు. ఎఫ్సీల గడువు ముగిసినా విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా యాజమాన్యం నడుపుతున్న బస్సులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీఓ హెచ్చరించారు.
290 బస్సుకు ఎస్సీలు లేవు
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1001 పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు గత నెల 15వ తేదీతో ముగిసిం ది. ప్రతి బస్సుకూ పరీక్షలు నిర్వహించి వాటి సామర్థ్యాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 717 బస్సులకు మాత్రమే ఎఫ్సీలు తీసుకున్నారు. ఇంకా 290 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లను తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూ ల్ బస్సులు రోడ్డుపైకి వచ్చాయి. బస్సులను తనిఖీలను నిర్వహించి ఫిట్నెస్లేని బస్సులను ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. సీజ్ చేసిన బస్సులను ఆర్టీఓ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలన్నారు. స్కూల్ బస్సులు మితిమీరిన వేగంతో నడుపుతున్నా, ఫిట్నెస్ లేకున్నా విద్యార్థుల తల్లిదండ్రులు తమ కార్యాలయ ఏఓ కరీంకు 98485 28645 ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు మురళీమోహన్, జయప్రకాష్, రత్నకుమార్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు రఫీ, గోరే సాహెబ్, ప్రభాకర్, రాములు పాల్గొన్నారు.