ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీ: పన్నెండు మంది మృతి
లక్నో: లక్నో: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో గత అర్థరాత్రి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించారు. మరో 45 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. క్రిషాక్ ఎక్స్‌ప్రెస్ రైలు సిగ్నాల్ దాటి వెళ్లి అదే ట్రాక్‌పై వస్తున్న బరౌనీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది.
బరౌనీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన అయిదు జనరల్ బోగీలు పట్టాలు తప్పగా... క్రిషాక్ ఎక్స్‌ప్రెస్ రైలులోని పలు కోచ్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. కాగా క్రిషాక్ ఎక్స్‌ప్రెస్ రైల్ డ్రైవర్లు ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. కాగా గోరఖ్‌పూర్ మార్గంలో పలురైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను మాత్రం మరో మార్గంలో మళ్లిస్తున్నారు.