ఉల్లంఘనలన్నీ ఆంధ్రప్రదేశ్వే!
►అక్రమంగా నిర్మాణాలు చేస్తూ అభాండాలు వేస్తున్నారు..
►కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై బోర్డుకు వివరణ ఇచ్చిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో తాము చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి కేంద్ర జల సంఘం, బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతుల్లేవంటూ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ మరోమారు స్పందించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఉల్లం ఘనలకు పాల్పడుతున్నది ఏపీనే అని, తెలంగాణ ఎక్క డా ఉల్లంఘనలు చేయడం లేదని స్పష్టం చేసిం ది. ఇప్పటికే పాలమూరు –రంగారెడ్డి, డిండి, భక్త రామదాస, కల్వకుర్తి విస్తరణ, మిషన్ భగీరథలపై ఫిర్యాదు చేసిన ఏపీ, తాజాగా తుమ్మిళ్ల ఎత్తిపోతలపై ఫిర్యాదు చేయడం తెలంగాణ ఆగ్రహానికి కారణమైంది. తుమ్మిళ్ల ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు ఇటీవల రాష్ట్ర వివ రణ కోరిన నేపథ్యంలో స్పందిస్తూ అసలు వాస్తవాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లింది.
పాల మూరు, డిండి ఇతర ప్రాజెక్టులు కొత్తవి కావని ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్‌కు తెలిపామని, దానికి అపెక్స్ సైతం అంగీకరించి, విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదని ధ్రువీకరించినట్లు వివరించింది. ఏపీనే అదనపు మార్గాలు వెతుకుతూ పెద్ద మొత్తంలో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకునే యత్నాలు చేస్తోందని ఆరోపించింది. ముచ్చుమర్రి, మున్నేరు బ్యారేజీ, శివభాష్యం సాగర్ వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలించే ఎత్తుగడలు వేస్తోందని తెలిపింది. మున్నేరు బ్యారేజీకి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ముంపు ఉంటున్నా, వాటిని పట్టించుకోకుండా, ఆర్అండ్ఆర్ సమస్యలను పరిష్కరించకుండా, బ్యాక్ వాటర్ తీవ్రతను గణించకుండానే ఏపీ ఇష్టారీతిన చేపడుతోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి ఉల్లంఘనలన్ని ఏపీ చేస్తూ తెలంగాణ ప్రాజెక్టులపై అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడింది.
తుమ్మిళ్ల కొత్తది కాదు..
రాష్ట్రం చేపడుతున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, ఆర్డీఎస్కు ఉన్న నీటి వాటాలను వినియోగించుకునేందుకు దీన్ని చేపడుతున్నామని స్పష్టం చేసింది. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులను 1940ల్లోనే చేశారని, దీని కింద 87,500 ఎకరాల ఆయకట్టును నిర్ణయిం చారని వివరించింది. అయితే దశాబ్దాలుగా ఆర్డీఎస్ కింద సరాసరి వినియోగం 6 టీఎంసీ లను దాటలేదని, 30 వేల ఎకరాలకు మించి సాగవ్వడం లేదని దృష్టికి తెచ్చింది. ఈ దృష్ట్యానే నీరందని 55,600 ఎకరాలకు సాగు నీరు, దారిలోని గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుంకేశుల బ్యాక్ వాటర్ ఫోర్ షోర్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపింది. ఇది కేవలం సప్టిమెం టేషన్ పథకమే తప్ప కొత్త ప్రాజెక్టు కాదని వివరణ ఇచ్చింది.