తహసీల్దారుగారూ నిద్రపోతున్నారా!
ఎకరం భూమి ధర ఎంతో కూడా తెలీదా
మచిలీపట్నం తహసీల్దార్ నారదమునిపై జేసీ ఆగ్రహం
అరిశేపల్లి వీఆర్వో సస్పెన్షన్‌కు హుకుం
యూజ్లెస్ ఫెలో వాట్ ఆర్ యూ డూయింగ్... వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యూ... వాట్ ఆర్ యూ టాకింగ్... ఆన్సర్ మై క్వశ్చన్... ఇక్కడ భూమి విలువ ఎంత ఉందో నీకు తెలుసా.. తెలీదా? ప్రభుత్వ ధర ఎంత.. రైతులు అమ్ముతున్న ధర ఎంత..? ఒక జిల్లా అధికారి పరిశీలనకు వస్తున్నప్పుడు కనీసం రైతులను పిలవాలన్న బుద్ధి కూడా లేకుండా పోయిందా మీకు... నిద్రపోతూ డ్యూటీ చేస్తున్నారా... అంటూ జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు రెవెన్యూ సిబ్బందిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
మచిలీపట్నం (కోనేరుసెంటర్) :నంబర్ 216 జాతీయ రహదారి కోసం సేకరించనున్న మచిలీపట్నం–పెడన రోడ్డులోని భూములను పరిశీలించేందుకు జేసీ చంద్రుడు మంగళవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ అధికారులు స్పష్టమైన సమాధానాలు చెప్పకపోవడంతో విసుగుచెందిన ఆయన మండిపడ్డారు. తొలుత బైపాస్ రోడ్డులో ఎకరం భూమి ధర ఎంత, రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఉందని అడగడంతో తహసీల్దార్ బి.నారదముని తడబడ్డారు. ఆగ్రహించిన జేసీ ‘ఏం తహసీల్దార్ గారూ నిద్ర మత్తు వదల్లేదా అంటూ సీరియస్ అయ్యారు. నారదముని స్పందించి అన్ని వివరాలు చెప్పినా సంతృప్తి చెందని జేసీ ‘ఏంటి.. అంతా తిరకాసుగా సమాధానం చెబుతున్నారు. ఫీజు ధర సుమారు 10 లక్షలు ఉందనుకో.. ప్రభుత్వ ధర కంటే తక్కువకు ఎలా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. మీకు విషయం పూర్తిగా తెలిస్తే కరెక్టు సమాధానం చెప్పండి.. లేదంటే పేపర్లు చూసి చెప్పండి’ అని విసుక్కున్నారు. కంగారుపడిన తహసీల్దారు పేపర్లు వెతికి బదులిచ్చారు.
వీఆర్వోపై సస్పెన్షన్ వేటుకు సిద్ధం
రైతులతో మాట్లాడేందుకు వచ్చిన జేసీ అక్కడ రైతులు లేకపోవడంతో అరిశేపల్లి వీఆర్వో నీల్‌కాంత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా అధికారి పరిశీలనకు వస్తుంటే భూములకు సంబంధించిన రైతులను పిలవకుండా చేతులు ఆడించుకుంటూ వచ్చావా, ఎప్పట్నుంచి వీఆర్వోగా పని చేస్తున్నావ్.. గతంలో ఎక్కడ చేశావ్ అంటూ.. ప్రశ్నలవర్షం కురిపించారు. ఇక్కడి వచ్చి కొద్ది కాలమే అయిందంటూ వీఆర్వో చెప్పగా గ్రామంపై అవగాహన ఉండాలని చెప్పి.. అందుకు ఏం చేయాలని మళ్లీ ప్రశ్నించారు. వీఆర్వో సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేసేందుకు నివేదిక పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
సుల్తానగరంలో జేసీని కలిసిన రైతులు
సర్వేలో భాగంగా హుస్సేన్‌పాలెం, అరిశేపల్లి, ఎస్ఎన్ గొల్లపాలెం భూములను పరిశీలించిన జేసీ సుల్తానగరం వెళ్లగా అక్కడి రైతులు గంధం చంద్రుడిని కలిశారు. ఆయన స్థానికంగా భూమి ధర ఎలా ఉందనే విషయంపై వారితో మాట్లాడగా ఎకరం రెండు కోట్లు వరకు ఉందని బదులివ్వడంతో పాటు భూములు కోల్పోయే రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాసరావు, టౌన్ సర్వేయర్ వెంకటేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.