రంగారెడ్డికి కృష్ణా, మంజీరా జలాలు అవసరం
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాకు కృష్ణ, మంజీరా జలాలు అవసరమని.. అయితే, ఇప్పటి వరకు ఆ జలాలు జిల్లాకు వస్తాయనే స్పష్టత రాలేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం ఎన్ని నీళ్లు రావాలో నిపుణులతో మాట్లాడి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్షం పడక 10 రోజులు అవుతుందని.. ఇలాగే ఉంటే పంట ఉంటుందో పోతుందో తెలియక రైతులు బాధ పడుతున్నారన్నారు. జిల్లాలో వ్యవసాయమే ఆధారంగా ప్రజలు జీవిస్తున్నారన్నారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి నీళ్లు తేవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నీళ్ల విషయమై జేఏసీ ఎన్నోసార్లు సమావేశమై చర్చించిందన్నారు. జిల్లాకు రావాల్సిన నీటి విషయంపై జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఆలోచన చేస్తామన్నారు.
జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.రవీందర్ మాట్లాడుతూ. జేఏసీ ఒక లక్ష్యం కోసం పోరాటం చేసిందన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ çబాగు పడుతుందనుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏ లక్ష్యం కోసం ప్రతి ఒక్కరం కృషి చేశామో ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. విద్యార్థి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజీత్‌మఠంలా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వికారాబాద్‌లో ఉద్యమాన్ని ఉత్వెత్తున నడిపామన్నారు. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబం ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రౌడీలతో దాడులు చేయించి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందులో చేరి మొత్తం కుటుంబం ఇప్పుడు పదవులు అనుభవిస్తుందన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఉద్యమ నాయకులపై హేళన చేస్తూ మాట్లాడడం సరైంది కాదన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యోగాన్ని, తండ్రిని కోల్పోయి చంద్రకాంత్‌రెడ్డి ఎన్ని ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడో ఇక్కడి విద్యార్థులకు తెలుసునన్నారు. మంత్రి వైఖరి మార్చుకోక పోతే మరో ఉద్యమానికి ఈ ప్రాంత విద్యార్థులు సిద్ధమని హెచ్చరించారు. అనంతరం ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్, సబ్‌కలెక్టర్ శృతిఓజాకు వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ కె.శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కల్కోడ నర్సిములు, తాండూరు జేఏసీ చైర్మన్ సోమశేఖర్, సీనియర్ న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘాల నాయకుడు రాంరెడ్డి, పాండురంగం, వెంకటయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.