పోటెత్తిన భక్తజనం
కృష్ణా పుష్కరాల్లో రెండో రోజు పది లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు
► వరుస సెలవులతో పెరిగిన రద్దీ
► పాలమూరు ఘాట్లకే ఎక్కువగా తాకిడి
► నేడు, రేపు భక్తుల రాక పెరిగే అవకాశం
► టోల్‌ప్లాజాల వద్ద స్తంభించిన ట్రాఫిక్
► పలు చోట్ల స్వల్ప అపశ్రుతులు
సాక్షి నెట్వర్క్: వరుస సెలవుల నేపథ్యంలో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రెండో రోజు శనివారం 10 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పుష్కర ఘాట్లకే జనం తాకిడి ఎక్కువగా ఉంది. ఆది, సోమవారాల్లో పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పాలమూరులో పోటెత్తిన భక్త జనం..
శనివారం మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలకు చేశారు. జిల్లాలోని అన్ని ఘాట్లలో కలిపి 8.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. పలు చోట్ల అధికారుల అంచనాలకు మించి జనం రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బీచుపల్లిలో సోమశిల, అలంపూర్, పస్పుల, కృష్ణ, జూరాల, నది అగ్రహారం, గొందిమళ్ల, క్యాతూర్ పుష్కరఘాట్లు భక్తులతో నిండిపోయాయి. అలంపూర్‌లో స్నానం అనంతరం జోగుళాంబను దర్శించుకోవడానికి భారీగా బారులు తీరారు. రంగాపూర్, బీచుపల్లిలో నీటి మట్టం తగ్గింది. గుడబల్లూరు పుష్కరఘాట్‌లో మంత్రి లక్ష్మారెడ్డి, బీచుపల్లి పుష్కరఘాట్‌లో అదనపు డీజీపీ అంజనికుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పుణ్య స్నానాలు చేశారు.
నల్లగొండ ఘాట్లలో ప్రముఖుల పుణ్య స్నానాలు
నల్లగొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు రెండో రోజు భక్తుల సంఖ్య పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 28 ఘాట్లలో శనివారం 1.7 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. నాగార్జునసాగర్‌లోని శివాలయం వీఐపీ ఘాట్‌లోనే 90 వేల మందికిపైగా పుణ్య స్నానమాచరించినట్లు అంచనా. వాడపల్లి, మట్టపల్లిల్లోనూ జన సందోహం పెరిగింది. వాడపల్లిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధర్మవర్దనరావు పుష్కర స్నానం చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మట్టపల్లిలో, ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాగార్జునసాగర్‌లో, ప్రభుత్వ సలహాదారు రాంలక్ష్మణ్ మట్టపల్లిలో, మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రె డ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా వాడపల్లిలో పుణ్య స్నానాలు చేశారు. ఆది, సోమవారాలు సెలవుదినాలు కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పలు అపశ్రుతులు..
అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా నల్లగొండ సమీపంలో ఏర్పాటు చేసిన పానగల్ ఘాట్‌లో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆయన తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తర్కు చెందిన ఎస్. పెరుమాళ్లుగా గుర్తించారు. ఉదయం స్నానానికి వెళ్లిన ఆయన.. అలంకరణ బల్బుల కోసం ఏర్పాటు చేసిన తీగలు తగలడంతో మరణించాడు. అయితే పెరుమాళ్లు గుండెపోటుతో మరణించాడని అధికారులు చెబుతున్నారు. ఇక అదే ఘాట్‌లో ఓ ఐదేళ్ల చిన్నారి, 45 ఏళ్ల మహిళ నీళ్లలో మునిగిపోతుండగా.. గజ ఈతగాళ్లు రక్షించారు. ఇక పుణ్య స్నానాల కోసం మట్టపల్లి ఘాట్‌కు వెళుతున్న భక్తుల ఆటో.. చౌడపల్లి, మఠంపల్లి మధ్య బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక తమకు పని కల్పించాలని పారిశుద్ధ్య కార్మికులు, తమకు సరైన సౌకర్యాలు కల్పించాలని అర్చకులు పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు.
హైవేలపై వాహనాల రద్దీ
కృష్ణా పుష్కర స్నానాలకు వెళ్తున్న భక్తుల వాహనాలతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అధికారులు టోల్ వసూలును తాత్కాలికంగా నిలిపివేసి.. వాహనాలను వదిలివేశారు. ట్రాఫిక్ తగ్గాక టోల్ వసూలు చేశారు. మరోవైపు నల్లగొండ జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.