krishnaiya
-
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
వంగూరు, న్యూస్‌లైన్ :తల్లిలేని పిల్లలను అన్నితానై చూసుకోవాల్సిన కన్నతండ్రి వ్యసనపరుడయ్యాడు. అంతే కాకుండా పదమూడేళ్ల కూతురి రెక్కల కష్టంపై కన్నేసేవాడు. ఆమె తెచ్చిన మొత్తాన్ని ఇవ్వక పోతే వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే వంగూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఉమ(13) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగూరు గ్రామానికి చెందిన డొంక కృష్ణయ్య కు కవిత, ఉమ, వెంకటేష్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఆరునెలల క్రితం అతని భార్య అలివేలు అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కవిత, వెంకటేష్‌లు కూలీపనులకోసం హైదరాబాద్‌కు వెళ్లారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఉమ ఊర్లోనే ఉంటుంది. ఆమె కూలీనాలి చేసి తెచ్చే డబ్బే వారిరువురికీ ఆధారం. ఆ డబ్బులను ఇవ్వాలని తండ్రి కృష్ణయ్య ఆమెను తరుచుగా కొట్టేవాడని స్థానికులు అంటున్నారు. బుధవారం రాత్రి ఉమ ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని కృష్ణయ్య, అతని తమ్ముడు పుల్లయ్య చుట్టుపక్కల వారికి చెప్పారు. దీంతో వారంతా వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు చున్నీ ఉందని అమ్మాయిమాత్రం కిందపడిపోయి ఉన్నదని స్థానికులు తెలిపారు. ఆగ్రహంతో... ఉమను తండ్రే గొంతునులిమి చంపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కోపంతో స్థానిక మహిళలు కృష్ణయ్యను చితకబాదారు. గత కొంతకాలంగా కూతురుని అతను కొట్టేవాడని ఈరోజు కూడా తాగిన మైకంలో ఆమెను చంపేసి ఉంటాడని అంటున్నారు. ఇలాంటి వరిపై కఠినచర్యలు తీసుకోవాలని వారన్నారు. విచారణ జరుపుతున్నాం... విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించామని ఎస్ఐ చంద్రమౌళి గౌడ్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని మృతురాలి తండ్రి కృష్ణయ్య, బాబాయ్ పుల్లయ్యలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
‘ఇందిరమ్మ లబ్ధిదారులకు నెల రోజుల్లో బిల్లులు’
అర్వపల్లి, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ పథకంతో పాటు రచ్చబండ ద్వారా ఇళ్లు మంజూరై నిర్మిం చుకున్న లబ్ధిదారులకు నెలరోజుల్లో బిల్లులు చెల్లించనున్నట్లు గృహ నిర్మాణశాఖ సూర్యాపేట డివిజన్ ఈఈ ఏ. కృష్ణయ్య తెలిపారు. మండలంలోని తిమ్మాపురం, కొమ్మాల, వర్ధమానుకోట, కుంచమర్తి, అర్వపల్లి, కాసర్లపహడ్, లోయపల్లి, అడివెంల, కొత్తపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీ లించారు. అలాగే స్థానిక ఏఈ కార్యాలయంలో రికార్డులు పరి శీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట డివిజన్లో ఇంది రమ్మ పథకంతో పాటు మూడో విడత రచ్చబండ ద్వారా 90 వేల 418 ఇళ్లు మంజూరు కాగా 50వేల 808 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 19,391 ఇళ్ల నిర్మాణం మొదలు కావాల్సి ఉందన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి 35 వేల 387 ఇళ్లు మంజూరు కాగా 19 వేల 223 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. డివిజన్లో 13మండలాలకు సూర్యాపేట, పెన్పహడ్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో ఏఈ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం దొరకలేదని మిగిలిన మండలాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డీఈ నందీష్ కుమార్, ఏఈ సురేంద్రనాథ్ పాల్గొన్నారు.