వంగూరు, న్యూస్‌లైన్ :తల్లిలేని పిల్లలను అన్నితానై చూసుకోవాల్సిన కన్నతండ్రి వ్యసనపరుడయ్యాడు. అంతే కాకుండా పదమూడేళ్ల కూతురి రెక్కల కష్టంపై కన్నేసేవాడు. ఆమె తెచ్చిన మొత్తాన్ని ఇవ్వక పోతే వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే వంగూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఉమ(13) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగూరు గ్రామానికి చెందిన డొంక కృష్ణయ్య కు కవిత, ఉమ, వెంకటేష్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఆరునెలల క్రితం అతని భార్య అలివేలు అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కవిత, వెంకటేష్‌లు కూలీపనులకోసం హైదరాబాద్‌కు వెళ్లారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఉమ ఊర్లోనే ఉంటుంది. ఆమె కూలీనాలి చేసి తెచ్చే డబ్బే వారిరువురికీ ఆధారం. ఆ డబ్బులను ఇవ్వాలని తండ్రి కృష్ణయ్య ఆమెను తరుచుగా కొట్టేవాడని స్థానికులు అంటున్నారు. బుధవారం రాత్రి ఉమ ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని కృష్ణయ్య, అతని తమ్ముడు పుల్లయ్య చుట్టుపక్కల వారికి చెప్పారు. దీంతో వారంతా వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు చున్నీ ఉందని అమ్మాయిమాత్రం కిందపడిపోయి ఉన్నదని స్థానికులు తెలిపారు.
ఆగ్రహంతో...
ఉమను తండ్రే గొంతునులిమి చంపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కోపంతో స్థానిక మహిళలు కృష్ణయ్యను చితకబాదారు. గత కొంతకాలంగా కూతురుని అతను కొట్టేవాడని ఈరోజు కూడా తాగిన మైకంలో ఆమెను చంపేసి ఉంటాడని అంటున్నారు. ఇలాంటి వరిపై కఠినచర్యలు తీసుకోవాలని వారన్నారు.
విచారణ జరుపుతున్నాం...
విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించామని ఎస్‌ఐ చంద్రమౌళి గౌడ్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని మృతురాలి తండ్రి కృష్ణయ్య, బాబాయ్ పుల్లయ్యలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
Published Thu, Jan 16 2014 5:04 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement