నెలాఖరున కృష్ణపట్నం విద్యుత్
* సీవోడీ ప్రకటనకు ఏపీ జెన్కో అంగీకారం
* గరంగరంగా కృష్ణపట్నం పాలకమండలి భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరు నుంచి కృష్ణపట్నం విద్యుత్‌ను తెలంగాణకు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. జనవరి నెలాఖరున మొదటి యూనిట్‌కు సంబంధించి వాణిజ్యపరమైన ఉత్ప త్తి ప్రారంభించనున్నట్లు ఏపీ జెన్కో అధికారులు కృష్ణపట్నం పాలకమండలి సమావేశంలో ప్రకటించారు.
మొదటి యూనిట్‌ను జనవరి నెలాఖరున.. రెండో యూనిట్‌కు సంబంధించి మార్చి నెలాఖరున వాణిజ్య ఉత్పత్తి తేదీ (సీవోడీ) ప్రకటిస్తామని అంగీకరించారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం పాలకమండలి సమావేశం శుక్రవారం హైదరాబాద్ విద్యుత్ సౌధలో జరిగింది. ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌తో పాటు తెలంగాణ డిస్కంల తరఫున టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇతర అధికారులు భేటీకి హాజరయ్యారు. తొమ్మిది నెలలుగా కృష్ణపట్నంలో వాణిజ్య ఉత్పత్తిని ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలని తెలంగాణ అధికారులు పట్టుబట్టినట్లు తెలిసింది.
ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను ఏకపక్షంగా వాడుకొని తెలంగాణ వాటాను ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని ధ్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారం పంపిణీ చేయాలని పట్టుబట్టారు. వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే వాటాల పంపిణీ అంశం చర్చకు వస్తుందని ఏపీ జెన్కో అధికారులు ఈ విషయాన్ని తోసిపుచ్చినట్లు తెలిసింది. సాంకేతిక కారణాలతోనే వాణిజ్య ఉత్పత్తి ఆలస్యమైందని ఏపీజెన్కో అధికారులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.