‘అరణియార్’కు మోక్షం
34.97 కోట్లతో {పతిపాదనలు సిద్ధం
7 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు 12 గ్రామాలకు లబ్ధి
కృష్ణాపురం ప్రాజెక్టు ఆధునికీకరణకు - 43.65 కోట్లతో అంచనాలు
తిరుపతి: అరణియార్, కృష్ణాపురం ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు గురైన ఈ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులకు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) నిధులు సమకూర్చుతోంది. ఈ మేరకు అధికారులు సైతం ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ఎంతమేర నిధులు అవసరమో అంచనాలు సైతం రూపొందించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, జైకాకు సైతం ఇప్పటికే సమర్పించారు. జపాన్ బృందం పరిశీలించాక ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు.
అరణియార్ ప్రాజెక్టు
అరుణానదిపైన 1960 సంవత్సరంలో *1.26 కోట్లతో 5,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా అరణియార్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే కాలువలు పూడిపోవడంతో పాటు, ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు గురవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా లెఫ్ట్ కెనాల్, మిడిల్ కెనాల్, రైట్ కెనాల్, ట్యాంక్ స్ప్రింగ్ కెనాల్‌ను పటిష్టపరచడంతోపాటు వాటిని పూర్తిగా ఆధునికీకరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు నది వరద సమయంలో 24,715 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా కొత్తగా రేడియల్ గేట్లు అమర్చుతున్నారు. ఇందుకోసం అధికారులు మొత్తం *34.97 కోట్ల నిధులు అవసరమని అంచనాలు రూపొందించారు. దీని ద్వారా పిచ్చాటూరు మండలంలో శేషంపేట, రామగిరి, అప్పంబట్టు, వేలూరు, నీరువాయి, వెంగళత్తూరు, రామాపురం గ్రామాలు, నాగలాపురం మండలంలో కృష్ణాపురం, కలంగేరి, వినోభానగర్, నాగలాపురం గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. భూగర్భ జలాలు సైతం వృద్ధి చెందనున్నాయి.
కృష్ణాపురం ప్రాజెక్టు
లావ నది సమీపంలో కృష్ణాపురం గ్రామం వద్ద 1981 సంవత్సరంలో 6,125 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కుడికాలువ పరిధిలో 6 చెరువులు, ఎడమ కాలువ పరిధిలో 10 చెరువులు మొత్తం 16 చెరువులకు నీరు నింపడం ద్వారా 1325 ఎకరాలు, కాలువల ద్వారా 4,800 ఆయకట్టుకు నీరందేలా ప్రాజెక్టును నిర్మించారు. కాలువలు సరిగా లేకపోవడంతో ప్రస్తుతం 1,500 ఎకరాలకు సైతం నీరందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లైనింగ్, బెడ్ లైనింగ్ చేసి కాలువలు పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఇంతకు మునుపు ఆయకట్టు 6,125 ఎకరాలతో పాటు, అదనంగా 2,400 గ్యాపు ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా అధికారులు ప్రస్తుతం *43.65 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం ఈ ఆయకట్టు ఆధునికీకరణ ద్వారా కేపీ అగ్రహారం, తంగమిట్ట ఎగువ, దిగువ కుచివారి పల్లె, లక్ష్మీపురం, సెకువారిపల్లె, దిగువ ముదికుప్పం, చొక్కమడుగు, భట్టువారిపల్లె, కత్తెరపల్లె గ్రామాలకు లబ్ధి చేకూరనుంది.
ప్రతిపాదనలు సిద్ధం....
అరణియార్, కృష్ణాపురం ప్రాజెక్టు పనుల ఆధునికీకరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇప్పటికే అంచనాలను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. జపాన్ బృందం పర్యటించాక, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం.
-ఎస్వీ. నాగభూషణం, ఇరిగేషన్ ఈఈ తిరుపతి