ఆందోళనకరంగానే కృష్ణవేణి ఆరోగ్యం
కోలుకుంటున్న తల్లి, కుటుంబసభ్యులు..
హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో శుక్రవారం తీవ్రగాయాలకు గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి నీరజ కృష్ణవేణి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరో 24 గంటలు గడిస్తేగానీ ఏ పరిసితీ చెప్పలేమని డాక్టర్లు పేర్కొంటుండడంతో ఆమె కుటుంబీకు లు ఆవేదనకు గురవుతున్నారు. ప్రేమోన్మాది రాజు చేతిలో గాయపడిన నీరజ కృష్ణవేణితో పా టు ఆమె తల్లి తులసమ్మ, వరుసకు సోదరుడైన దుర్గా గంగాధర్‌లు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో తులసమ్మ, దుర్గాగంగాధర్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో శనివారం వారిని సాధారణ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తొలుత దాడి నాపైనే: దుర్గాగంగాధర్
కాగా ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షి, బాధితుడు అయిన నీరజ సోదరుడు గంగాధర్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘శుక్రవారం ఉదయం 5.30 గంటలకు మేమంతా నిద్రిస్తుండగానే ఒక్కసారిగా తలుపులను నెట్టుకొని రాజు లోనికి వచ్చాడు. కత్తితో బెదిరిస్తూ కదిలితే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో నేను అడ్డుకునేందుకు వెళ్లగా తొలుత నాపైనే కత్తితో దాడిచేసి గాయపరిచాడు. నేను గట్టిగా అరుస్తూ పడిపోగా మా అక్క నీరజ కృష్ణవేణిపై కత్తితో పాశవికంగా దాడిచేశాడు. అడ్డువచ్చిన మా పెద్దమ్మనూ గాయపరిచాడు. దీంతో మేమంతా కేకలు వేస్తూ రక్తపు మడుగులో పడిపోయాం. అవి విన్న మా పెద్దనాన్న వల్లభరావు ఇంట్లోకి రాగానే అతనిపైనా కత్తితో దాడికి రాజు యత్నించడంతో లాక్కొని అదే కత్తితో అతనిపై దాడిచేశాం’ అన్నాడు.
ఎలాంటి ఫిర్యాదులు లేవు: ఈ సంఘటనలో బాధితురాలి తండ్రి చేతిలో హతమైన రాజు విషయంలోగానీ, అంతకు ముందు అతను పాల్పడిన దాడి ఘటనపైన గానీ ఎవరు ఎవరిపైనా తమకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేయలేదనీ, స్థానికుల సమాచారం మేరకే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని కూకట్పల్లి సీఐ పురుషోత్తమం మీడియాకు తెలిపారు. రాజు శవానికి పోస్టుమార్టం చేయించి అతని కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. శవాన్ని అప్పగిస్తున్న సమయంలో మృతుడి సెల్‌ఫోన్‌లోని కాల్ డాటా, ఫొటోల ఆధారంగా విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగుచూస్తాయని రాజు బంధువులు తెలిపినప్పటికీ వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రేమోన్మాదిపై ప్రతిదాడిచేసిన యువతి తండ్రి వల్లభరావును విచారించామనీ, అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు.