విద్యార్థి గణేష్ మృతిపై విచారణ
సదాశివపేట/సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పట్టణంలోని కృష్ణవేణి టెక్నో స్కూల్లో సోమవారం ఎల్కేజీ విద్యార్థి గణేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై బుధవారం విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ స్వితా సబర్వాల్, డీఈఓ రమేష్‌ల ఆదేశాల మేరకు బుధవారం డిప్యూటీ ఈఓ శోభరాణి, ఎంఈఓ సురేష్‌లు కృష్ణవేణి టెక్కో స్కూల్‌ను సందర్శించారు. మొదట పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్‌ను విచారించారు. ఎల్కేజీకి తరగతులు చెప్పే ఉపాధ్యాయులు ఎవరూ గణేష్‌ను కొట్టలేదని తెలిపారు. గణేష్ తల్లిదండ్రులు బీదవారు కావడంతో గతేడాది కూడా ఫీజు చెల్లించలేదని, ఈ ఏడాది కూడా ఫీజు అడగలేదని విచారణ అధికారులకు వెల్లడించారు.
సోమవారం భోజనానంతరం ఉదయం 11.30 గంటలకు టిఫెన్ బాక్స్‌ను పెట్టడానికి వెళుతూ కింద పడ్డాడని సిబ్బంది తెలిపారన్నారు. తాను వెంటనే గణేష్‌ను స్థానిక సూర్య నర్సింగ్ హోంకు తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్కడి వైద్యులు చిన్న పిల్లల డాక్టరైన బాలాజీ పవార్ వద్దకు తీసుకెళ్లాలని సూచించారన్నారు. దీంతో తాము డాక్టర్ బాలాజీ పవార్ వద్దకు తీసుకెళ్లగా ఆయన బాలుడిని పరీక్షించి పల్స్‌రేటు బాగానే ఉందని తన వద్ద ఆక్సిజన్ లేనందు వల్ల ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ బాల్‌రాజ్ వద్దకు తీసుకువెళ్లగా సూచించారని తెలిపారు. అనంతరం ఎల్కేజీ తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయురాలు సౌజన్యను విచారించగా గణేష్‌ను తాము ఎవరం కొట్టలేదని తెలిపారు. అనంతరం ఎల్కేజీ చదువుతున్న చిన్నారులను విచారణ అధికారులు విచారించగా.. గణేష్‌ను టీచర్లు కొట్టలేదని, అన్నం తిన్న తరువాత టిఫెన్ బాక్స్‌ను పెట్టడానికి వెళ్లి కింద పడ్డాడని వివరించారు.
పాఠశాలలో విచారణ అనంతరం డిప్యూటీ ఈఓ శోభరాణి, ఎంఈఓ సురేష్‌లు సిద్దాపూర్ కాలనీలోని మృతుడు గణేష్ ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులు కొట్టినందు వల్లనే తమ కుమారుడు గణేష్ మృతి చెందాడని తల్లిదండ్రులు కృష్ణ మాధవీలు రోదిస్తూ తెలిపారు. గణేష్ గతేడాది నుంచి పాఠశాలకు రెగ్యులర్‌గా వస్తాడని, హాజరు పట్టికను పరిశీలించడం వల్ల తనకీ విషయం వెల్లడైందని డిప్యూటీ డీఈఓ శోభ తెలిపారు. విద్యార్థి గణేష్‌కు ఎప్పుడూ మూర్ఛ (ఫిట్స్) రాలేదని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారన్నారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థి సంఘాలు, విద్యార్థి తల్లిదండ్రులతో పాటు వా రి బంధువుల ద్వారా వచ్చిన ఫిర్యాదులను నివేదిక రూపంలో సమర్పించడం జరిగిందని డిప్యూటీ డీఈఓ శోభ తెలిపారు. విద్యార్థి గణేష్ మృతిపై విచారణ వివరాలను తాను డీఈఓ రమేష్‌కు నివేదిక అందజేస్తానన్నారు. పాఠశాలలో విచారణ సమయంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు అనిల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రహమాన్ తదితరులు ఉన్నారు.