కేన్సర్‌కు ‘క్రిస్పర్’
ప్రాణాంతక కేన్సర్ చికిత్సలో శాస్త్రవేత్తలు మరో కీలకమైన ముందడుగు వేశారు. మానవ జన్యువుల్లో అతిసులువుగా అవసరమైన మార్పులు చేయగల క్రిస్పర్ టెక్నాలజీని వాడే సరికొత్త చికిత్స విధానాన్ని తొలిసారి మానవులపై ప్రయోగించనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే కేన్సర్‌కు మరింత మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదు. శరీరంలో ఏదైన రోగకారక బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశిస్తే మొట్టమొదట స్పందించేది రోగనిరోధక వ్యవస్థే అనే విషయం తెలిసిందే. తెల్లరక్త కణాలతో కూడిన ఈ వ్యవస్థ నుంచి తప్పించుకుని కేన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి.
ఈ నేపథ్యంలో తెల్ల రక్తకణాలనే కేన్సర్‌కు చికిత్సగా వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన పరిశోధకుల్లో వచ్చింది. ఈ విధానాన్ని ఇమ్యునోథెరపీ అంటారు. ఇప్పటి వరకు కొన్ని వైరస్ల ద్వారా తెల్ల రక్త కణాలను చైతన్యవంతం చేసి చికిత్స అందించేవారు. క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ ద్వారా తెల్ల రక్తకణాల్లో జన్యుపరమైన మార్పులు చేసి అప్పటి వరకూ గుర్తించని కేన్సర్ కణాలను కూడా గుర్తించి చంపేలా చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ పద్ధతి పరిశోధనశాలలో మంచి ఫలితాలనిచ్చింది. దీంతో కొందరు చైనా శాస్త్రవేత్తలు మానవులపై వచ్చే నెల ప్రయోగాలు చేపట్టనున్నారు. సిచుహాన్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వెస్ట్ చైనా ఆస్పత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ముందు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడ్డవారిలో ఒకరి తెల్ల రక్త కణాలను మార్చి మళ్లీ వారిలో ప్రవేశపెడతారు. ఫలితాలను బట్టి మరికొంత మందిపై ప్రయోగాలు చేపడతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.