ప్రజల ఆశీస్సులే గెలిపించాయి : కొడాలి
గుడివాడ అర్బన్ : ప్రజల ఆశీస్సులు, కార్యకర్తలు కష్టించి పనిచేయడం వల్లే తాను గెలుపొందానని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. ‘కృష్ణజ్యోతి’ సాయంకాల దినపత్రిక సంపాదకుడు శ్రీకాంత్ బుధవారం రాత్రి పట్టణంలో కొడాలి నానితోపాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన సీనియర్ కౌన్సెలర్లకు సన్మాన సభ ఏర్పాటుచేశారు.
తెలుగు వికాస పరిరక్షణ నాయకుడు డీఆర్బీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ప్రజల అభిమానం, ఆశీస్సులే కారణమని చెప్పారు. తాను వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొంది గుడివాడ అంటే టీడీపీ అడ్డా అనుకునే పిచ్చిభ్రమల నుంచి కొందరని బయటపడేశానని పేర్కొన్నారు. తనను గెలిపించిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మునిసిపల్ కౌన్సిలర్లుగా గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొడాలి నానిపై గుడివాడలో ఎవరూ గెలుపొందలేరని అభిప్రాయపడ్డారు. అనంతరం యలవర్తి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు నెరుసు చింతయ్య, అడపా బాబ్జీ, వెంపల హైమావతిలను ఘనంగా సన్మానించారు.
నాయకులు పాలేటి చంటి, పెదదుర్గారావు, రావులకొల్లు హైమావతి, రామలింగేశ్వరరావు, కాటి విశాలి, మూడెడ్ల ఉమా, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, వెంపల అప్పారావు, ఆది, హన్ను, బోయిన శ్రీనివాసమూర్తి, వంకా విజయకుమార్, బన్ను, గాయత్రి, బాణావత్ ఇందిరారాణి, కాటాబత్తుల రత్నకుమారి, పాలేటి చంటి, గంధం రాజేంద్రప్రసాద్, ఉషోదయ పాఠశాల ప్రిన్సిపాల్ తుమ్మల రత్న, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు దుడ్డు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.