ఇసుకలో ఆడేటి కుసుమ సిరిబాల!
గ్రంథపు చెక్క
పాట లేనిది బతుకు లేదు. బతుకు దారి పొడుగునా అక్కడ ఒక చెట్టులాగా, ఇక్కడ ఒక ఏరులాగా పాట తగుల్తూనే ఉంటుంది. బతుకులో పాట కోసం మనం ఎదురుచూడం. అనుకోకుండా వచ్చే అతిథి వంటిది పాట. ఊత, ఊపు, ఊరట, ఉల్లాసం, ఉత్సాహం... ఎన్నో అవుతుంది మానవుని బతుకులో ఈ పాట. తల్లులు పాడేవి మహాచల్లగా, తీయగా ఉంటాయి. మొట్ట మొదటి పాట - విద్దెం విద్దెం వరహాల విద్దెం / విద్దెం చేస్తే గిద్దెడు నెయ్యి తప్పక చేస్తే తవ్వెడు నెయ్యి / మళ్లీ చేస్తే మానెడు నెయ్యి ఈ పాటలో బిడ్డ వట్టి చంటిపాప. పాకే పాపకు నిలబడ్డం నేర్పుతుంది తల్లి. బోసి నోరు విప్పి కిలకిల నవ్వుతూ చిగురు మేనుతో బిడ్డ ఈ పాటలో సాక్షాత్కరిస్తుంది. చల్ల చేసే బిడ్డ ఇసుకలోకి నడిచి వెళ్లి అక్కడ ఆడుకుంటుంది.
ఇసకలో ఆడేటి కుసుమ సిరిబాల ఆ బాల పేరేమి ఆనవాలేమి / ఆనవాలు అంబరస పేరు బాలయ్య అని పాపను గర్వంగా తల్లి హెచ్చరిస్తుంది. పాప మరి కాస్త పెరుగుతాడు. పక్క పక్కనే ఆడే పాప ముంగిటిదాకా నడుస్తాడు.
- కృష్ణశాస్త్రి ‘అమూల్యాభిప్రాయాలు’ పుస్తకం నుంచి.