krupa rani
-
టార్గెట్!
టీడీపీ, కాంగ్రెస్‌లు సరికొత్త మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు తెరతీశాయి. గుండ, కిల్లి కుటుంబాలు సాగిస్తున్న ఈ రాజకీయ క్రీడలో కింజరాపు వికెట్టే టార్గెట్. ఇందుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గమే మైదానం. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొద్దిమంది నేతలతో ఈ మేరకు సంప్రదింపుల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఒకవైపు సదరు నేతలు కాంగ్రెస్‌ను వీడకుండా కేంద్రమంత్రి బుజ్జగిస్తుంటే.. మరోవైపు గుండ కుటుంబ సభ్యులు మంతనాలు సాగిస్తున్నారు. ఈ రెండు వర్గాలదీ ఉభయతారక మంత్రమే. ఒక ఓటు ఇటు... ఇంకో ఓటు అటు.. అని ప్రతిపాదిస్తున్నారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలసి పని చేస్తున్నట్లు నటిస్తూనే గుండ కుటుంబం తన దారి తాను చూసుకుంటోంది. కృపారాణి కూడా అదే బాటలో శ్రీకాకుళంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో నిమిత్తం లేకుండా ఓట్ల వేట సాగిస్తున్నారు. ఈ సరికొత్త క్రీడ శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాన్ని రసవత్తరం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో పరస్పరం సహకరించకునే టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయ క్రీడలో తొలి అంకానికి గుండ కుటుంబం శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌లో మిగిలిన ఉన్న కొద్దిమంది నేతలకు కింజరాపు కుటుంబమంటే ఏమాత్రం పడదు. కానీ వారితో గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా మంతనాలు సాగిస్తుండటం విశేషం. గుజరాతిపేటలో కాంగ్రెస్ నేత దంతులూరి రమేష్‌బాబుతో కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత గుండ లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపారు. వాస్తవానికి రమేష్ బాబుపై గుండ కుటుంబం గత కొన్నేళ్లుగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల తరణంలో అవన్నీ వదిలేసి ఆయనతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది. లక్ష్మీదేవి ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి మరీ తమకు సహకరించాల్సిందిగా కోరారు. గుజరాతిపేటలో పదేళ్లుగా టీడీపీ బాధ్యతలు చూస్తున్న కీలక నేతలకు కూడా సమాచారమివ్వకుండా ఆమె రమేష్‌బాబుతో సంప్రదింపులు జరపడం గమనార్హం. తాము టీడీపీలోకి రాలేమని ఆయన చెప్పగా.. పార్టీలోకి రాకపోయినా పర్లేదు ఎన్నికల్లో సహకరించాలని లక్ష్మీదేవి కోరారు. ఎమ్మెల్యే ఓటు వరకు సహకరిస్తాంగానీ ఎంపీ ఓటు గురించి మాత్రం అడగవద్దని రమేష్‌బాబు కరాఖండీగా చెప్పేశారు. ఇందుకు గుండ కుటుంబం సమ్మతించినట్లు తెలుస్తోంది. అంటే ఎంపీ ఓటు వేయకపోయినా పర్లేదు... ఎమ్మెల్యే ఓటు తమకు వేస్తే చాలన్న రీతిలో వారు మంత్రాంగం నడుపుతున్నారన్న మాట. అదే విధంగా కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు సుంకరి కృష్ణ, తదితరులతో కూడా గుండ కుటుంబం మంతనాలు సాగిస్తోంది. సుంకరి కృష్ణను టీడీపీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ పదవి హామీ ఇస్తే తప్ప తాను పార్టీలోకి రాలేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలోకి రాకపోయినా ఎన్నికల్లో తమకు సహకరిచాల్సిందిగా గుండ కుటుంబం కోరింది. సుంకరి కృష్ణ కూడా ఎమ్మెల్యే ఓటు వరకు సహకారం అందిస్తాం.. ఎంపీ ఓటు గురించి మాత్రం ప్రస్తావించవద్దని చెప్పేశారు. దానికి అభ్యంతర చెప్పకుండా గుండ కుటంబం ఓకే అన్నట్లు సమాచారం. అంటే.. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌తో పని లేకుండా తమ ఓటు పదిలం చేసుకునే పనిలో పడిందన్న మాట. లక్ష్మీదేవి అడుగుజాడల్లో కృపారాణి ఇక మ్యాచ్ ఫిక్సింగ్ రెండో భాగాన్ని కేంద్రమంత్రి కృపారాణి తన భుజాన వేసుకున్నారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం గుండ లక్ష్మీదేవి బాటలోనే ఆమె సాగుతున్నారు. లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపి వచ్చిన వెంటనే అదే నేతలతో కృపారాణి మంతనాలు సాగిస్తున్నారు. దంతులూరి రమేష్‌బాబుతో లక్ష్మీదేవి చర్చలు జరిపిన కొన్ని రోజులకే కృపారాణి ఆయనతో మంతనాలు సాగించి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. ఎంపీ ఓటు తనకు వేయాలని.. ఎమ్మెల్యే ఓటు లక్ష్మీదేవికి వేయాలని ప్రతిపాదించారు. అంటే లక్ష్మీదేవి ఏ ఒప్పందానికి వచ్చారో.. అదే ఒప్పందానికి కృపారాణి సై అన్నారు. ఆ తర్వాత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణ నివాసానికి కూడా వెళ్లి ఎంపీ అభ్యర్థిగా తనకు మద్దతిస్తే చాలు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవికి సహకరించినా పర్లేదని చెప్పేశారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని పలువురు కాంగ్రెస్ నేతలతో కూడా లక్ష్మీదేవి, కృపారాణి ఇటువంటి ఒప్పందాలే కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ పరస్పర సహకార ఉద్యమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. అటు గుండ కుటుంబం తమ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ గెలుపు కోసం పట్టించుకోవడం లేదు.. ఇటు కృపారాణి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఫిక్సింగ్ రాజకీయం పర్యవసనాలు ఎలా ఉంటాయో మరి! -
అంగన్వాఢీ
గత కొన్నాళ్లుగా ఆందోళనపథంలో ఉన్న అంగన్వాడీలు శుక్రవారం పోలీసులతో ఢీకొట్టారు. శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కృపారాణి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లిన ఉద్యమకారులను పోలీసులు, భద్రతా బలగాలు అడ్డుకున్నారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించిన అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 179 మందిని పోలీసులు అరెస్టు చేసి, బలవంతంగా తరలించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చే సైనా జిల్లాల్లో మూతపడిన అంగన్వాడీ కేంద్రాలను తక్షణం తెరిపించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి తల్లుల కమిటీతో గాని, మహిళా సంఘాలతో గాని కేంద్రాలను నడిపించాలని ఆదేశించారు. సూపర్వైజర్లు అందుకు చర్యలు తీసుకునేలా జిల్లా అధికారులు ఆదేశించాలని అవసరమైన రక్షణ కల్పించాలన్నారు. శనివారం నుంచి కేంద్రాలు పనిచేయకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అంగన్వాడీల కోర్కెలను తీర్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కార్యాలయం ముట్టడి అంతకుముందు శ్రీకాకుళం పట్టణంలో కేంద్ర మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన అంగన్వాడీ కార్యకర్తలు 179 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం విదితమే. తమ ఆందోళనలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు అంగన్వాడీలు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. తర్వాత అంగన్వాడీలు మంత్రి కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్‌లో పడేశారు. పోలీసుల ప్రవర్తనతో పలువురు మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని వ్యాన్‌లో మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టు చేసిన వారిలో సీఐటీయూ నాయకులు పంచాది పాపారావు, అరుణ, డి.గణేష్, అంగన్డీ వర్కర్ల సంఘం నాయకులు కల్యాణి, చిన్నమ్మడు, ఆదిలక్ష్మి, రమణమ్మ, కృష్ణవేణి తదితరులు ఉన్నారు. అరెస్టయిన అంగన్వాడీ కార్యకర్తలను మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ పరామర్శించారు. వారి డిమాండ్లు సరైనవని, ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని కోరారు. -
‘రాజు’కు రాణి చెక్!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయనతోపాటు పలువురు నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లనుండటం కాంగ్రెస్ పదవుల కాక రేపింది. ఈ నాయకులు ఖాళీ చేయనున్న పదవుల్లో తిష్ట వేసేందుకు పలువురు ఆశావహులు చేస్తున్న యత్నాలు.. ఇదే అదనుగా జిల్లా చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న కేంద్రమంత్రి కృపారాణి ఆడుతున్న రాజకీయ చదరంగం రక్తి కడుతున్నాయి. ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవి విషయంలో కేంద్రమంత్రి రోజుకో రకంగా వ్యవహరిస్తూ చదరంగంలో పావులను కదిపినట్లు అభ్యర్థుల పేర్లు మార్చేస్తుండటంతో ఆశావహులు ఉసూరుమంటున్నారు. ఆమె తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. దర్మానతోపాటు కాంగ్రెస్‌ను వీడనున్నట్లు భావిస్తున్న ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్ర స్థానంలో శిమ్మ రాజశేఖర్ పేరు దాదాపు ఖరారైంది. ఆదివారం సాయంత్రం వరకు ఆయన పేరే వినిపించింది. ఆ తర్వాత శరవేగంగా మారిన పరిణామాల్లో డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు రాజశేఖర్ పట్ల సుముఖత చూపిన కృపారాణి మనసు మార్చుకొని డోల జగన్ వైపు మొగ్గారు. ఈ మార్పు వెనుక పీసీసీ అధ్యక్షుడి వ్యూహం కూడా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కృపారాణినే పార్టీకి పెద్దదిక్కుగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఆమె ఏది చెబితే అదే జరిగే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షునిగా శిమ్మ రాజశేఖర్‌ను ఎంపిక చేయాలని కృపారాణి తొలి నుంచి భావించారు. పలు పేర్లు పరిశీలనలోకి వచ్చినా ఆమె మాత్రం రాజశేఖర్ పేరునే సూచించినట్లు భోగట్టా. ఆదివారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే ఆయన అంత సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఆయన అభ్యంతరాన్ని ఖాతరు చేయకుండా కృపారాణి తనకున్న వేరే మార్గాల ద్వారా రాజశేఖర్ పేరును ఖరారు చేయించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. దీన్ని గమనించిన పీసీసీ అధ్యక్షుడు వ్యూహం మార్చారు. జిల్లా పార్టీలోని కాపు సామాజిక వర్గ నాయకులతో మాట్లాడి ఆ వర్గానికే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేయించడంతోపాటు, గతంలో కేంద్రమంత్రికి వ్యతిరేకంగా శిమ్మ రాజశేఖర్ చేసినా వ్యాఖ్యలను, మరికొన్ని వ్యవహారాలను కేంద్రమంత్రికి ఆమె అనుచరులతోనే చెప్పించడం ద్వారా ఆమె చేతే శిమ్మ పేరును రేసు నుంచి తొలగించేలా చేశారని తెలుస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున రానున్న ఎన్నికల్లో వారి మద్దతు అవసరమని చెప్పించడంతో ఆమె మనసు మార్చుకున్నట్లు పలువురు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాజశేఖర్ అలక ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ కినుక వహించినట్లు సమాచారం. ఇప్పటికే డీసీసీబీ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తికి ఇంకో పదవి ఇవ్వాలని నిర్ణయించడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న కృపారాణి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత డీసీసీ పదవిని పీరుకట్ల విశ్వప్రసాద్‌కు, ఆయన ఎమ్మెల్సీ అయిన తరువాత డీసీసీ పదవిని నర్తు నరేంద్రయాదవ్కు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒకరికి రెండు పదవులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్‌లో మరో దుమారం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండగా, ఆయన వెంట పలానా వారు వెళతారంటూ ముందుగానే, ఆ పదవుల్లో ఎవరెవరిని నియమించాలన్న దానిపై జిల్లా కాంగ్రెస్ నాయకులు సమాలోచనలు చేస్తుండడాన్ని కొందరు నాయకులు తప్పుపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు ధర్మాన వెంట వెళ్తారో లేదో తెలియకపోయినా కొత్త డీ సీసీ అధ్యక్షుడి ఎంపికకు పూనుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.