అంగన్‌వాఢీ
గత కొన్నాళ్లుగా ఆందోళనపథంలో ఉన్న అంగన్‌వాడీలు శుక్రవారం పోలీసులతో ఢీకొట్టారు. శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కృపారాణి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లిన ఉద్యమకారులను పోలీసులు, భద్రతా బలగాలు అడ్డుకున్నారు.
వారిని తీవ్రంగా ప్రతిఘటించిన అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 179 మందిని పోలీసులు అరెస్టు చేసి, బలవంతంగా తరలించారు.
పోలీసు బందోబస్తు ఏర్పాటు చే సైనా జిల్లాల్లో మూతపడిన అంగన్‌వాడీ కేంద్రాలను తక్షణం తెరిపించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి తల్లుల కమిటీతో గాని, మహిళా సంఘాలతో గాని కేంద్రాలను నడిపించాలని ఆదేశించారు. సూపర్‌వైజర్లు అందుకు చర్యలు తీసుకునేలా జిల్లా అధికారులు ఆదేశించాలని అవసరమైన రక్షణ కల్పించాలన్నారు. శనివారం నుంచి కేంద్రాలు పనిచేయకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అంగన్‌వాడీల కోర్కెలను తీర్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి కార్యాలయం ముట్టడి
అంతకుముందు శ్రీకాకుళం పట్టణంలో కేంద్ర మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన అంగన్‌వాడీ కార్యకర్తలు 179 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం విదితమే. తమ ఆందోళనలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు అంగన్‌వాడీలు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. తర్వాత అంగన్‌వాడీలు మంత్రి కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్‌లో పడేశారు. పోలీసుల ప్రవర్తనతో పలువురు మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని వ్యాన్‌లో మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టు చేసిన వారిలో సీఐటీయూ నాయకులు పంచాది పాపారావు, అరుణ, డి.గణేష్, అంగన్‌డీ వర్కర్ల సంఘం నాయకులు కల్యాణి, చిన్నమ్మడు, ఆదిలక్ష్మి, రమణమ్మ, కృష్ణవేణి తదితరులు ఉన్నారు. అరెస్టయిన అంగన్‌వాడీ కార్యకర్తలను మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ పరామర్శించారు. వారి డిమాండ్లు సరైనవని, ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని కోరారు.