టార్గెట్!
టీడీపీ, కాంగ్రెస్‌లు సరికొత్త మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు తెరతీశాయి. గుండ, కిల్లి కుటుంబాలు సాగిస్తున్న ఈ రాజకీయ క్రీడలో కింజరాపు వికెట్టే టార్గెట్. ఇందుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గమే మైదానం.
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొద్దిమంది నేతలతో ఈ మేరకు సంప్రదింపుల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఒకవైపు సదరు నేతలు కాంగ్రెస్‌ను వీడకుండా కేంద్రమంత్రి బుజ్జగిస్తుంటే.. మరోవైపు గుండ కుటుంబ సభ్యులు మంతనాలు సాగిస్తున్నారు. ఈ రెండు వర్గాలదీ ఉభయతారక మంత్రమే.
ఒక ఓటు ఇటు... ఇంకో ఓటు అటు.. అని ప్రతిపాదిస్తున్నారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలసి పని చేస్తున్నట్లు నటిస్తూనే గుండ కుటుంబం తన దారి తాను చూసుకుంటోంది. కృపారాణి కూడా అదే బాటలో శ్రీకాకుళంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో నిమిత్తం లేకుండా ఓట్ల వేట సాగిస్తున్నారు. ఈ సరికొత్త క్రీడ శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాన్ని రసవత్తరం చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
శ్రీకాకుళంలో పరస్పరం సహకరించకునే టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయ క్రీడలో తొలి అంకానికి గుండ కుటుంబం శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌లో మిగిలిన ఉన్న కొద్దిమంది నేతలకు కింజరాపు కుటుంబమంటే ఏమాత్రం పడదు. కానీ వారితో గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా మంతనాలు సాగిస్తుండటం విశేషం.
గుజరాతిపేటలో కాంగ్రెస్ నేత దంతులూరి రమేష్‌బాబుతో కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత గుండ లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపారు. వాస్తవానికి రమేష్ బాబుపై గుండ కుటుంబం గత కొన్నేళ్లుగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల తరణంలో అవన్నీ వదిలేసి ఆయనతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది. లక్ష్మీదేవి ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి మరీ తమకు సహకరించాల్సిందిగా కోరారు.
గుజరాతిపేటలో పదేళ్లుగా టీడీపీ బాధ్యతలు చూస్తున్న కీలక నేతలకు కూడా సమాచారమివ్వకుండా ఆమె రమేష్‌బాబుతో సంప్రదింపులు జరపడం గమనార్హం. తాము టీడీపీలోకి రాలేమని ఆయన చెప్పగా.. పార్టీలోకి రాకపోయినా పర్లేదు ఎన్నికల్లో సహకరించాలని లక్ష్మీదేవి కోరారు.
ఎమ్మెల్యే ఓటు వరకు సహకరిస్తాంగానీ ఎంపీ ఓటు గురించి మాత్రం అడగవద్దని రమేష్‌బాబు కరాఖండీగా చెప్పేశారు. ఇందుకు గుండ కుటుంబం సమ్మతించినట్లు తెలుస్తోంది. అంటే ఎంపీ ఓటు వేయకపోయినా పర్లేదు... ఎమ్మెల్యే ఓటు తమకు వేస్తే చాలన్న రీతిలో వారు మంత్రాంగం నడుపుతున్నారన్న మాట.
అదే విధంగా కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు సుంకరి కృష్ణ, తదితరులతో కూడా గుండ కుటుంబం మంతనాలు సాగిస్తోంది. సుంకరి కృష్ణను టీడీపీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ పదవి హామీ ఇస్తే తప్ప తాను పార్టీలోకి రాలేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలోకి రాకపోయినా ఎన్నికల్లో తమకు సహకరిచాల్సిందిగా గుండ కుటుంబం కోరింది.
సుంకరి కృష్ణ కూడా ఎమ్మెల్యే ఓటు వరకు సహకారం అందిస్తాం.. ఎంపీ ఓటు గురించి మాత్రం ప్రస్తావించవద్దని చెప్పేశారు. దానికి అభ్యంతర చెప్పకుండా గుండ కుటంబం ఓకే అన్నట్లు సమాచారం. అంటే.. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌తో పని లేకుండా తమ ఓటు పదిలం చేసుకునే పనిలో పడిందన్న మాట.
లక్ష్మీదేవి అడుగుజాడల్లో కృపారాణి
ఇక మ్యాచ్ ఫిక్సింగ్ రెండో భాగాన్ని కేంద్రమంత్రి కృపారాణి తన భుజాన వేసుకున్నారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం గుండ లక్ష్మీదేవి బాటలోనే ఆమె సాగుతున్నారు. లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపి వచ్చిన వెంటనే అదే నేతలతో కృపారాణి మంతనాలు సాగిస్తున్నారు. దంతులూరి రమేష్‌బాబుతో లక్ష్మీదేవి చర్చలు జరిపిన కొన్ని రోజులకే కృపారాణి ఆయనతో మంతనాలు సాగించి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు.
ఎంపీ ఓటు తనకు వేయాలని.. ఎమ్మెల్యే ఓటు లక్ష్మీదేవికి వేయాలని ప్రతిపాదించారు. అంటే లక్ష్మీదేవి ఏ ఒప్పందానికి వచ్చారో.. అదే ఒప్పందానికి కృపారాణి సై అన్నారు. ఆ తర్వాత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణ నివాసానికి కూడా వెళ్లి ఎంపీ అభ్యర్థిగా తనకు మద్దతిస్తే చాలు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవికి సహకరించినా పర్లేదని చెప్పేశారు.
శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని పలువురు కాంగ్రెస్ నేతలతో కూడా లక్ష్మీదేవి, కృపారాణి ఇటువంటి ఒప్పందాలే కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ పరస్పర సహకార ఉద్యమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. అటు గుండ కుటుంబం తమ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ గెలుపు కోసం పట్టించుకోవడం లేదు.. ఇటు కృపారాణి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఫిక్సింగ్ రాజకీయం పర్యవసనాలు ఎలా ఉంటాయో మరి!