‘రాజు’కు రాణి చెక్!
Published Tue, Dec 3 2013 3:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయనతోపాటు పలువురు నాయకులు వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లనుండటం కాంగ్రెస్ పదవుల కాక రేపింది. ఈ నాయకులు ఖాళీ చేయనున్న పదవుల్లో తిష్ట వేసేందుకు పలువురు ఆశావహులు చేస్తున్న యత్నాలు.. ఇదే అదనుగా జిల్లా చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న కేంద్రమంత్రి కృపారాణి ఆడుతున్న రాజకీయ చదరంగం రక్తి కడుతున్నాయి. ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవి విషయంలో కేంద్రమంత్రి రోజుకో రకంగా వ్యవహరిస్తూ చదరంగంలో పావులను కదిపినట్లు అభ్యర్థుల పేర్లు మార్చేస్తుండటంతో ఆశావహులు ఉసూరుమంటున్నారు. ఆమె తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.
దర్మానతోపాటు కాంగ్రెస్‌ను వీడనున్నట్లు భావిస్తున్న ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్ర స్థానంలో శిమ్మ రాజశేఖర్ పేరు దాదాపు ఖరారైంది. ఆదివారం సాయంత్రం వరకు ఆయన పేరే వినిపించింది. ఆ తర్వాత శరవేగంగా మారిన పరిణామాల్లో డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు రాజశేఖర్ పట్ల సుముఖత చూపిన కృపారాణి మనసు మార్చుకొని డోల జగన్ వైపు మొగ్గారు. ఈ మార్పు వెనుక పీసీసీ అధ్యక్షుడి వ్యూహం కూడా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కృపారాణినే పార్టీకి పెద్దదిక్కుగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఆమె ఏది చెబితే అదే జరిగే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షునిగా శిమ్మ రాజశేఖర్‌ను ఎంపిక చేయాలని కృపారాణి తొలి నుంచి భావించారు.
పలు పేర్లు పరిశీలనలోకి వచ్చినా ఆమె మాత్రం రాజశేఖర్ పేరునే సూచించినట్లు భోగట్టా. ఆదివారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే ఆయన అంత సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఆయన అభ్యంతరాన్ని ఖాతరు చేయకుండా కృపారాణి తనకున్న వేరే మార్గాల ద్వారా రాజశేఖర్ పేరును ఖరారు చేయించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. దీన్ని గమనించిన పీసీసీ అధ్యక్షుడు వ్యూహం మార్చారు. జిల్లా పార్టీలోని కాపు సామాజిక వర్గ నాయకులతో మాట్లాడి ఆ వర్గానికే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేయించడంతోపాటు, గతంలో కేంద్రమంత్రికి వ్యతిరేకంగా శిమ్మ రాజశేఖర్ చేసినా వ్యాఖ్యలను, మరికొన్ని వ్యవహారాలను కేంద్రమంత్రికి ఆమె అనుచరులతోనే చెప్పించడం ద్వారా ఆమె చేతే శిమ్మ పేరును రేసు నుంచి తొలగించేలా చేశారని తెలుస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున రానున్న ఎన్నికల్లో వారి మద్దతు అవసరమని చెప్పించడంతో ఆమె మనసు మార్చుకున్నట్లు పలువురు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
రాజశేఖర్ అలక
ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ కినుక వహించినట్లు సమాచారం. ఇప్పటికే డీసీసీబీ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తికి ఇంకో పదవి ఇవ్వాలని నిర్ణయించడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న కృపారాణి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత డీసీసీ పదవిని పీరుకట్ల విశ్వప్రసాద్‌కు, ఆయన ఎమ్మెల్సీ అయిన తరువాత డీసీసీ పదవిని నర్తు నరేంద్రయాదవ్‌కు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒకరికి రెండు పదవులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్‌లో మరో దుమారం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండగా, ఆయన వెంట పలానా వారు వెళతారంటూ ముందుగానే, ఆ పదవుల్లో ఎవరెవరిని నియమించాలన్న దానిపై జిల్లా కాంగ్రెస్ నాయకులు సమాలోచనలు చేస్తుండడాన్ని కొందరు నాయకులు తప్పుపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు ధర్మాన వెంట వెళ్తారో లేదో తెలియకపోయినా కొత్త డీ సీసీ అధ్యక్షుడి ఎంపికకు పూనుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.
Advertisement