ఓఎంసీ కేసులో అనుబంధ చార్జిషీట్
నిందితులుగా సబిత, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి ముడి ఇనుప గనుల కేటాయింపు కేసులో రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంలను సీబీఐ నిందితులుగా చేర్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో బుధవారం అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సెలవులో ఉండడంతో మొదటి అదనపు జడ్జి రమేష్ ఎదుట ఈ అనుబంధ చార్జిషీట్ సీబీఐ అధికారులు దాఖలు చేశారు. కృపానందాన్ని ఎనిమిది, సబితా ఇంద్రారెడ్డిని తొమ్మిదో నిందితులుగా పేర్కొన్నారు.
సబితా ఇంద్రారెడ్డిని ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో సాక్షిగా పేర్కొన్నామని, అయితే ఈ కుట్రలో ఆమె పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆమెను నిందితురాలిగా చేర్చామని నివేదించారు. ఈ మేరకు ఆమెను నిందితురాలిగా మార్చేందుకు అనుమతించాలని కోర్టును కోరుతూ సీబీఐ మరో మెమోను దాఖలు చేసింది. దీనిపై విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.
అక్రమాలకు పాల్పడ్డారు: ఓఎంసీకి గనుల లీజుల మంజూరులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ కార్యదర్శి కృపానందం అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తన అనుబంధ చార్జిషీట్లో ఆరోపించింది. క్యాప్టివ్ (సొంత పరిశ్రమ అవసరాలకు మాత్రమే) అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించి ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ పదాన్ని తొలగించడంతోనే ఓఎంసీ ముడి ఇనుమును ఎగుమతి చేసుకోగలిగిందని తెలిపింది. ఐపీసీ 120(బి) రెడ్‌విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(డి) సెక్షన్ల కింద వీరిపై అభియోగాలను మోపింది. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం మినహా లీజుల కేటాయింపులో అక్రమాలు తదితర అంశాలపై దర్యాప్తు పూర్తయ్యిందని కోర్టుకు నివేదించింది. 65 పేజీల అనుబంధ చార్జిషీట్‌తోపాటు 104 అనుబంధ పత్రాలు, 36 మందిని సాక్షులుగా పేర్కొంది. ఈ కేసులో 2011 డిసెంబర్లో సీబీఐ దాఖలు చేసిన ప్రధాన చార్జిషీట్లో సబితను 53వ సాక్షిగా, మొదటి, రెండవ అనుబంధ చార్జిషీట్లలో 8వ సాక్షిగా చేర్చింది. అయితే ప్రధాన చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఆమెను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం.
ఈ కేసులో మిగతా నిందితులు: ఓఎంసీ కంపెనీ డెరైక్టర్ గాలి జనార్దన్‌రెడ్డి, ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనులశాఖ మాజీ డెరైక్టర్ వి.డి.రాజ్‌గోపాల్, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్‌రెడ్డి సహాయకుడు అలీఖాన్, గనులశాఖ అధికారి లింగారెడ్డి (చనిపోయారు)లతో పాటు ఓఎంసీ కంపెనీని ఈ కేసులో నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది.