ఆన్లైన్లోనే ఆర్జిత సేవల బుకింగ్
* డిసెంబరు 1 నుంచి ఇంటెర్నెట్ ద్వారా కేటాయింపు
* డీడీల ద్వారా శ్రీవారి సేవల అడ్వాన్స్ బుకింగ్ రద్దు
* జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడి
సాక్షి, తిరుమల: శ్రీవారి సుప్రభాతం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ వంటి సేవలకు ఇకపై అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసి, డిసెంబరు ఒకటి నుంచి ఇంటెర్నెట్ ద్వారా కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు గురువారం వెల్లడించారు. డిమాండ్ డ్రాఫ్ట్లతో లేఖల ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్న విధానంపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన తెలిపారు. అందువల్ల ఇంటర్నెట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలతో పాటు గదులు కూడా కేటాయించాలని నిర్ణయించినట్టు గురువారం విలేకరులకు చెప్పారు.
శ్రీవారి దర్శనానికి రూ. 300 టికెట్లను ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని 91 పోస్టాఫీసుల్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తొలుత తిరుపతి, చిత్తూరు, ఏలూరు, విజయనగరం, వరంగల్ నగరాల్లోని పోస్టాఫీసుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం ఒక్కో టికెట్టుపై పోస్టాఫీసుకు మూడు రూపాయల పదహారు పైసలు టీటీడీ చెల్లించే విధంగా ఒప్పందం కుదిరిందన్నారు.
జనవరి ఒకటో తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 5 వేలు, ద్వాదశికి 15 వేల వరకు రూ. 300 టికెట్లు ఇంటెర్నెట్ ద్వారా కేటాయించేందుకు యోచన చేస్తున్నామన్నారు. అలాగే నెలలోని మొదటి మంగళవారం ఆధార్ కార్డుతో వచ్చే స్థానికుల ఉచిత దర్శనం రద్దు చేసి, అదే కోటా కింద ఒకటో తేదీ వైకుంఠ ఏకాదశిలో నగదుపై రూ. 300 టికెట్ల దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ఏకాదశి, ద్వాదశినాడు నిబంధలనమేరకు వీఐపీలకు పరిమిత సంఖ్యలో పాసులు ఇస్తామని, వారి సిఫారసులను అంగీకరించే ప్రసక్తేలేదన్నారు.