‘పనిచేసే మంత్రిపై..పనికిరాని విమర్శలా?’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే కలను సాకారం చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్న మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి .జీవన్‌రెడ్డి సహా కొందరు కాంగ్రెస్ నేతలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే మంత్రిపై కువిమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిడ్ మానేరుకు గండిపడిన ఉదంతాన్ని కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
మిడ్‌మానేరు గండిపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రెండేళ్ల కిందటి దాకా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. శంషాబాద్‌కు బదులు సిరిసిల్లను జిల్లాగా చేయాలని టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు. కొత్త జిల్లాలు ప్రజల సౌకర్యం కోసం తప్ప పార్టీలు, నేతల సౌలభ్యం కోసం కాదన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా వివాదాస్పదం చేయడం కాంగ్రెస్, టీడీపీలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.