ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదుల దీక్ష..విరమణ
నిజామాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేయాలని గత మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు అమరణ నిరాహర దీక్షకు దిగారు. ఈ క్రమంలో శనివారం జిల్లాను సందర్శించిన మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డిలు ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు స్పష్టమైన హామీనిచ్చారు. అనంతరం న్యాయవాదులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం హైకోర్టు కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫైల్‌ను సుప్రీంకోర్టుకు పంపినట్లు మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా, ప్రత్యేక హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు నుంచి మంగళవారంలోగా స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఆయన న్యాయవాదులను దీక్ష విరమించాలని కోరారు. అనంతరం మంత్రులు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.