kuchupudi
-
USA : ఘనంగా జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
వాషింగ్టన్ డి.సి. లోని నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాము. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాలనుండి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డి.సి. నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్, మార్సెలో శాంచెజ్ సోరోండో మొదలైనవారు ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో 1000 మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. -
తడబడిన తుది అడుగులు
‘చరణ కింకినులు ఘల్లు ఘల్లుమన.. కరకంకణములు గలగల లాడగ.. హూహూహూ.. అడుగులందు కలహంసలాడగా.. నడుములో తరంగంబులూగగ.. వినీల ఘటపర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా.. నీ కులుకులుగని నా పలుకు విరియ.. నీ నటననుగని నవ కవిత వెలయగ.. నీ తనువులోని అణువణువులోన.. అనంత విధముల అభినయించి.. అలసి.. సొలసి.. ఆపన్న హస్తంకై ఎదురు చూస్తున్నావా నాట్య మయూరీ..’ అని ఓ సినిమాలోని పాటను కాస్త ఇలా మార్చి కళాకారిణి లంక అన్నపూర్ణ ప్రస్తుత దయనీయ స్థితిపై ఆర్ద్రతతో పాడుకోవచ్చు. సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే పెద్ద తపనతో నాట్యం నేర్చుకుంది. దేశ వ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రముఖుల అభినందనలు అందుకుంటున్న తరుణంలో ఓ ప్రమాదంలో కాలును కోల్పోయింది. అదే దశలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి వదిలేసి వెళ్లిపోయినా కుంగిపోలేదు. జైపూర్ కొయ్య కాలు పెట్టుకుని దేశ వ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలను ఇచ్చి ఔరా అన్పించింది. 70 ఏళ్ల వయస్సు దాటిన ఆమెకు పక్షవాతం రావడంతో ఇప్పుడు ఆసుపత్రిపాలైంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతోంది. ఇదేదో ‘మయూరి’ సినిమా సుధ కథ కాదు. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి లంక అన్నపూర్ణ నిజ జీవిత గాధ. నాట్య మయూరిగా నర్తించిన నాటి నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యే వరకు సమస్యలను సవాలుగా తీసుకుని ఆమె జీవన ప్రస్థానం కొనసాగించింది. నిలదొక్కుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం, పట్టుదల ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అయితే ఆర్థికంగా ఆర్జించకపోవడంతో నేడు కష్టకాలంలో ఆదుకునే వారి కోసం ఎదురు చూడాల్సి రావడం విచారకరం. దేశ నలుమూలలా ప్రదర్శనలు కృష్ణా జిల్లా గుడివాడలో లక్ష్మీనారాయణ, సుబ్బలక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన లంక అన్నపూర్ణ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) వరకు చదివింది. ఐదవ తరగతి నుంచే ఆమె చింతా సీతారామాంజనేయులు, భాగవతుల రామతారకం వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత కూచిపూడి కులపతిగా పని చేసిన చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. చిన్నతనం నుంచే దేశ వ్యాప్తంగా భరత నాట్యం, కూచిపూడి నృత్యం చేస్తూ పలువురితో ప్రశంసలు అందుకుంది. 1962లో భారత్ – చైనా యుద్ధం సమయంలో ఏలూరుకు చెందిన నాట్యాచార్యుడు కోరాడ నర్శింహారావు తదితర కళాకారులతో కలిసి వెళ్లి దేశ సరిహద్దుల్లో పని చేస్తున్న సైనికుల్లో ఉత్తేజం నింపుతూ కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆ ప్రదర్శనల అనంతరం ఢిల్లీకి వెళ్లిన ఆమెతో పాటు కళాకారుల బృందాన్ని ఆనాటి ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణలు అభినందించడం విశేషం. మలుపు తిప్పిన రైలు ప్రమాదం.. అమెరికా వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో 1973లో జరిగిన రైలు ప్రమాదం అన్నపూర్ణ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేసింది. ఢిల్లీ నుంచి వస్తున్న తన స్నేహితురాలికి ఆహ్వానం పలికేందుకు గుడివాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అదే సమయంలో ప్లాట్ఫారం పై నుంచి జారి రైలు పట్టాలపై పడింది. అదే సమయంలో సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో ఒక కాలు మోకాలి వరకు, మరో కాలు మడమ వరకు తెగిపోయింది. ఊహించని ఆ ప్రమాదం ఆమె ఆశలు, ఆశయాలపై నెత్తురు చిమ్మింది. ఆసుపత్రిపాలైన ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆపరేషన్ చేసినా ఫలితం లేక కాలును కోల్పోయింది. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని వెంట ఉన్న వ్యక్తి కాలు లేని ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. నాట్యంపై ఉన్న మక్కువతో పట్టుదలగా జైపూర్ కొయ్యకాలు పెట్టుకుని మళ్లీ దేశమంతా తిరిగి 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి చేత శభాష్ అన్పించుకుంది. ఆమె గొప్పతనానికి, ధైర్యానికి మెచ్చిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1982లో విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో ప్రత్యేకంగా డ్యాన్స్ టీచర్ పోస్టు ఏర్పాటు చేసి అన్నపూర్ణకు ఉపాధి కోసం ఉద్యోగం ఇచ్చింది. దయనీయం శేష జీవితం డ్యాన్స్ టీచర్‌గా 2006లో పదవీ విరమణ చేసిన ఆమె విజయవాడ సత్యనారాయణపురంలో స్థిరపడింది. ఒంటరిగా శేష జీవితం గడుపుతున్న ఆమె ప్రస్తుత పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఇంటి తలుపులు తీయడం లేదని గుర్తించిన స్థానికులు ఏలూరులో ఉంటున్న ఆమె సోదరికి సమాచారం అందించారు. దీంతో ఏలూరులో లాయర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్ (సోదరి అల్లుడు) విజయవాడ వచ్చి సత్యనారాయణపురంలో ఇంటి తలుపులు తెరిచేసరికి అన్నపూర్ణ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను విజయవాడ సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్చడంతో పక్షవాతం వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం సోదరి తరఫు బంధువుల తోడ్పాటుతో ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. అయిన వారి ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రమే ఉండటంతో పేరుగాంచిన నాట్య మయూరికి ఖరీదైన వైద్యం అందించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కళాపోషకులు, సహృదయులు ఎవరైనా స్పందించి ఆదుకోకపోతారా.. అని వారు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
టీసీఏజీటీ ఆధ్వర్యంలో కూచుపూడి శిక్షణ శిబిరం
టొరంటో : ప్రముఖ నృత్య కళాకారుడు, డ్యాన్స్ మాస్టర్ కళారత్న కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కెనెడాలో కూచుపూడి శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. మార్చి 9 నుంచి 17 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఐదేళ్లు మించి ఆసక్తిగలవారు నమోదు చేసుకోవాలని తెలుగు సాంసృతిక సంఘం గ్రేటర్ టొరంటో (టీసీఏజీటీ) పేర్కొంది. తొలి సెషన్ లో భాగంగా కేవీ సత్యనారాయణతో మార్చి 19న చిన్నారుల పరిచయకార్యక్రమం ఉంటుంది. హిందూ హెరిటేజ్ సెంటర్, 6300 మిస్సిసాగా రోడ్డు, కెనడాలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. మార్చి 10, 11న మథేసన్ బిఎల్వీడీ ఈస్ట్, మిస్సిసాగాలో, మార్చి 12, 15, 16న హిందూ హెరిటేజ్ సెంటర్, 6300 మిస్సిసాగా రోడ్డులో విద్యార్థులకు కూచుపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా మార్చి 17న విద్యార్థులు టీసీఏజీటీ ఉగాది వేడుకల్లో ప్రదర్శనను ఇవ్వనున్నట్టు టీసీఏజీటీ తెలిపింది. -
పిట్ట కొంచెం..ఆట ఘనం
నేడు కూచిపూడి అరంగేట్రం చేయనున్న ఎనిమిదేళ్ల లక్ష్మీశృతి వయసు ఎనిమిదేళ్లు..ప్రదర్శనలు 45 రాజమహేంద్రవరం కల్చరల్ : ‘అచట పుట్టిన చిరుకొమ్మైన చేవ’...మహిష్మతీపురాన్ని గురించి అల్లసాని పెద్దన చేసిన వర్ణన పూర్తిగా రాజమహేంద్రవరానికి అన్వయిస్తుంది. 2008 ఫిబ్రవరి 25న జన్మించిన బేతాళ శ్రీసాయి ముత్యలక్ష్మీశృతి ఇప్పటి వరకు 45 నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం రివర్‌బే హోటల్లో యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు, కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళారత్న హంస అవార్డు గ్రహీత డి.రాజకుమార్ ఉడయార్, తదితర అతిరథ, మహారథుల మధ్య కూచిపూడి అరంగేట్రానికి ఈ చిన్నారి సిద్ధమవుతోంది. ఎల్కేజీలో చూసిన డాన్స్ ప్రేరణ ఇచ్చింది ఎల్కేజీ చదువుతుండగా ఆనం కళాకేంద్రంలో చూసిన ‘డాన్స్’పేరిట జరిగిన నృత్యప్రదర్శన చూసాక, నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి లక్ష్మీశృతిలో చిగురించింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రలో కూచిపూడి నాట్యం నేర్చుకోసాగింది. తొలిసారిగా ఆనం కళాకేంద్రంలో ‘సంగీత నాట్యామృత సంభవం’ నృత్యరూపకంలో శ్రీకృష్ణునిగా నటించి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. విజయవాడ, హైదరాబాద్, కొత్తపేట తదితర నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. గోదావరి పుష్కరాల్లో నక్షత్రమాలికాచరిత్రం, శంకరవైభవం నృత్య రూపకాల్లో చక్కని అభినయనాన్ని ప్రదర్శించింది. అన్ని అంశాలలోను శిక్షణ పొందాక, ఆదివారం పూర్తిస్థాయి కూచిపూడి అరంగేట్రానికి లక్ష్మీశృతి సిద్ధమవుతోంది. ఎన్నో పురస్కారాలు..ప్రశంసలు శ్రీసద్గురు సన్నిధి, విశ్వం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ్ఞాన సరస్వతీ పీఠం, డ్రీమ్స్ కాన్సెప్ట్ స్కూల్ వేదికలపై లక్ష్మీశృతి నర్తించి, అవార్డులను అందుకుంది. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలు పోటీల్లో సైతం బహుమతులను గెలుచుకుంది. వృత్తిరీత్యా డాక్టరు కావాలని, ప్రవృత్తి రీత్యా కూచిపూడి నర్తకిగా ఎదగాలని ఈ చిన్నారి కోరుకొంటోంది.