తడబడిన తుది అడుగులు | Famous Kuchipudi Dancer Lanka Annapurnas Real Life Story | Sakshi
Sakshi News home page

తడబడిన తుది అడుగులు

Published Tue, Sep 24 2019 3:47 AM | Last Updated on Tue, Sep 24 2019 3:09 PM

Famous Kuchipudi Dancer Lanka Annapurnas Real Life Story - Sakshi

కూచిపూడి నాట్యకళాకారిణి లంకా అన్నపూర్ణ(ఫైల్‌ఫోటో) , ఇన్‌సెట్‌లో ఆసుపతత్రిలో అన్నపూర్ణ

‘చరణ కింకినులు ఘల్లు ఘల్లుమన..
కరకంకణములు గలగల లాడగ..
హూహూహూ.. అడుగులందు కలహంసలాడగా..
నడుములో తరంగంబులూగగ..
వినీల ఘటపర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా..
నీ కులుకులుగని నా పలుకు విరియ..
నీ నటననుగని నవ కవిత వెలయగ..
నీ తనువులోని అణువణువులోన.. 
అనంత విధముల అభినయించి.. 
అలసి.. సొలసి.. ఆపన్న హస్తంకై ఎదురు చూస్తున్నావా నాట్య మయూరీ..’ 
అని ఓ సినిమాలోని పాటను కాస్త ఇలా మార్చి కళాకారిణి లంక అన్నపూర్ణ ప్రస్తుత దయనీయ స్థితిపై ఆర్ద్రతతో పాడుకోవచ్చు.

సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే పెద్ద తపనతో నాట్యం నేర్చుకుంది. దేశ వ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ప్రముఖుల అభినందనలు అందుకుంటున్న తరుణంలో ఓ ప్రమాదంలో కాలును కోల్పోయింది. అదే దశలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి వదిలేసి వెళ్లిపోయినా కుంగిపోలేదు. జైపూర్‌ కొయ్య కాలు పెట్టుకుని దేశ వ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలను ఇచ్చి ఔరా అన్పించింది. 70 ఏళ్ల వయస్సు దాటిన ఆమెకు పక్షవాతం రావడంతో ఇప్పుడు ఆసుపత్రిపాలైంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతోంది. ఇదేదో ‘మయూరి’ సినిమా సుధ కథ కాదు. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి లంక అన్నపూర్ణ నిజ జీవిత గాధ. నాట్య మయూరిగా నర్తించిన నాటి నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యే వరకు సమస్యలను సవాలుగా తీసుకుని ఆమె జీవన ప్రస్థానం కొనసాగించింది. నిలదొక్కుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం, పట్టుదల ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అయితే ఆర్థికంగా ఆర్జించకపోవడంతో నేడు కష్టకాలంలో ఆదుకునే వారి కోసం ఎదురు చూడాల్సి రావడం విచారకరం. 

దేశ నలుమూలలా ప్రదర్శనలు
కృష్ణా జిల్లా గుడివాడలో లక్ష్మీనారాయణ, సుబ్బలక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన లంక అన్నపూర్ణ గ్రాడ్యుయేషన్‌ (డిగ్రీ) వరకు చదివింది. ఐదవ తరగతి నుంచే ఆమె చింతా సీతారామాంజనేయులు, భాగవతుల రామతారకం వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత కూచిపూడి కులపతిగా పని చేసిన చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. చిన్నతనం నుంచే దేశ వ్యాప్తంగా భరత నాట్యం, కూచిపూడి నృత్యం చేస్తూ పలువురితో ప్రశంసలు అందుకుంది. 1962లో భారత్‌ – చైనా యుద్ధం సమయంలో ఏలూరుకు చెందిన నాట్యాచార్యుడు కోరాడ నర్శింహారావు తదితర కళాకారులతో కలిసి వెళ్లి దేశ సరిహద్దుల్లో పని చేస్తున్న సైనికుల్లో ఉత్తేజం నింపుతూ కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆ ప్రదర్శనల అనంతరం ఢిల్లీకి వెళ్లిన ఆమెతో పాటు కళాకారుల బృందాన్ని ఆనాటి ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణలు అభినందించడం విశేషం. 

మలుపు తిప్పిన రైలు ప్రమాదం.. 
అమెరికా వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో 1973లో జరిగిన రైలు ప్రమాదం అన్నపూర్ణ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేసింది. ఢిల్లీ నుంచి వస్తున్న తన స్నేహితురాలికి ఆహ్వానం పలికేందుకు గుడివాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అదే సమయంలో ప్లాట్‌ఫారం పై నుంచి జారి రైలు పట్టాలపై పడింది. అదే సమయంలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రావడంతో ఒక కాలు మోకాలి వరకు, మరో కాలు మడమ వరకు తెగిపోయింది. ఊహించని ఆ ప్రమాదం ఆమె ఆశలు, ఆశయాలపై నెత్తురు చిమ్మింది. ఆసుపత్రిపాలైన ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆపరేషన్‌ చేసినా ఫలితం లేక కాలును కోల్పోయింది. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని వెంట ఉన్న వ్యక్తి కాలు లేని ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. నాట్యంపై ఉన్న మక్కువతో పట్టుదలగా జైపూర్‌ కొయ్యకాలు పెట్టుకుని మళ్లీ దేశమంతా తిరిగి 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి చేత శభాష్‌ అన్పించుకుంది. ఆమె గొప్పతనానికి, ధైర్యానికి మెచ్చిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1982లో విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో ప్రత్యేకంగా డ్యాన్స్‌ టీచర్‌ పోస్టు ఏర్పాటు చేసి అన్నపూర్ణకు ఉపాధి కోసం ఉద్యోగం ఇచ్చింది.  

దయనీయం శేష జీవితం 
డ్యాన్స్‌ టీచర్‌గా 2006లో పదవీ విరమణ చేసిన ఆమె విజయవాడ సత్యనారాయణపురంలో స్థిరపడింది. ఒంటరిగా శేష జీవితం గడుపుతున్న ఆమె ప్రస్తుత పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఇంటి తలుపులు తీయడం లేదని గుర్తించిన స్థానికులు ఏలూరులో ఉంటున్న ఆమె సోదరికి సమాచారం అందించారు. దీంతో ఏలూరులో లాయర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్‌ (సోదరి అల్లుడు) విజయవాడ వచ్చి సత్యనారాయణపురంలో ఇంటి తలుపులు తెరిచేసరికి అన్నపూర్ణ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను విజయవాడ సన్‌రైజ్‌ ఆసుపత్రిలో చేర్చడంతో పక్షవాతం వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం సోదరి తరఫు బంధువుల తోడ్పాటుతో ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. అయిన వారి ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రమే ఉండటంతో పేరుగాంచిన నాట్య మయూరికి ఖరీదైన వైద్యం అందించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కళాపోషకులు, సహృదయులు ఎవరైనా స్పందించి ఆదుకోకపోతారా.. అని వారు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement