నేత్రపర్వం భీమేశ్వరుని పరిణయం
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన శ్రీకుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామికి, బాల త్రిపుర సుందరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ విగ్రహాలకు నంది వాహనంపై గ్రామోత్సం నిర్వహించారు. రాత్రి విగ్రహాలకు ధ్వజారోహణ అనంతరం ఆలయం తోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వేదికపై స్వామి, అమ్మవారి విగ్రహాలను ఉంచి వేద పండితులు కల్యాణం జరిపిం చారు. అన్నవరం ఆలయ ఈఓ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆ ఆలయ వేదపండితులు, స్థానిక ఆలయ వేదపండితులు కల్యాణం నిర్వహించారు. కంచికామకోటి పీఠం ఆస్థాన పండితుడు చంద్రాభట్ల చింతామణిగణపతిశాస్త్రి, ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్మోహన్, సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, బి.త్రిమూర్తులు, చుండ్రు సూర్యభాను, గొల్లపల్లి కామరాజు, దూది రాజు, బలుసు శ్రీనివాసు, ఇమ్మంది వెంకటేశ్వరరావు, ఆలయ భక్త సంఘం నాయకులు బిక్కిన సాయిపరమేశ్వరరావు, చుండ్రు గోపాలకృష్ణ, చుండ్రు వాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పారిశ్రామిక వేత్తలు కర్రి సత్యనారాయణ, పసల పద్మరాఘవ రావు, డాక్టరు పసల సత్యానందరావు, మట్టపల్లి రమేష్, గంజి, బూరయ్య, సీసీఎస్ రాజు ఆర్వీ సుబ్బరాజు, ఆర్ వీరభద్రరావు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 27న స్వామి శ్రీపుష్పయాగోత్సవం జరుగుతుంది.
కమనీయం కుక్కుటేశ్వరుని కల్యాణం
పిఠాపురం : ‘దక్షిణ కాశీ’గా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలోని శ్రీకుక్కుటేశ్వరస్వామి కల్యాణం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. భక్త జనసందోహం నడుమ స్వామి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవార్ల పరిణయం ఆద్యంతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మ వార్లను పెళ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేశారు. అనంతరం స్థానిక శ్రీరామకృష్ణ వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపం వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. గజవాహనంపై గ్రామోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్రా్తలు, నగలతో అలంకరించి, ఊరేగింపుగా తీసుకు రంగు రంగుల విద్యుత్ దీపాలు, పువ్వులతో సుందరంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపచేశారు. వేదపండితులు చెరుకుపల్లి విశ్వనాథశర్మ, ద్విభాష్యం సుబ్రహ్మణ్యశర్మల ఆధ్వర్యంలో అర్చకులు విష్వక్సేన పూజతో కల్యాణాన్ని ప్రారంభించారు. రాత్రి 8.32 గంటలకు స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. పుణ్యాహవచనం, కంకణధారణ, సుముహూర్తం, కన్యాదానం, మంగళసూత్రధారణ, యజ్ఞోపవీతధారణ, తలంబ్రాలు, ఆశ్వీరచనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణల మధ్య జరిగిన కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ దంపతులు, ఈవో చందక దారబాబు, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కొండేపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.