పొట్టని‘పొడి’చేద్దాం...ఇలా...
లావుగా ఉన్నవారినే కాదు సన్నగా ఉన్నవారిని కూడా విసిగించే సమస్య పొట్ట. చాలా మంది అనుకున్నట్టు లావుగా ఉన్నవారికే పొట్ట ఉంటుందనేది కరెక్ట్ కాదు. మిగిలిన శరీరభాగాలతో పోల్చుకుంటే ఉదరభాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది ఎవరికైనా జరగవచ్చు. అందులో ప్రస్తుత ఆహారపు అలవాట్ల కారణంగా వయసులకు అతీతంగా ప్రతి ఒక్కరినీ వేధిస్తోందీ ఉదరభాగపు ఉబ్బు. మొత్తం బాడీషేప్‌ని పాడు చేసే శక్తి ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం నిపుణులు ఏం చెప్తున్నారంటే...
ముందుగా మీ నడుము చుట్టుకొలత కొలుచుకోవాలి. బరువు ఎంత అధికంగా ఉన్నామో కూడా పరీక్షించుకోవాలి. అది నిర్దేశించిన పరిమాణాన్ని దాటినట్టు గుర్తించగానే ముందుగా చేయాల్సింది వైద్యుని సంప్రదించడం. వారి సూచనల మేరకు ఉదరభాగం పెరగడానికి కారణాలేమిటో గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం. పరీక్షల ఫలితాల ప్రకారం వైద్యసలహా మేరకు ‘బెల్లీ’పై వార్ ప్రకటించాలి.
వర్కవుట్స్‌కి కంగారొద్దు...
పొట్ట పెరుగుతోందనగానే జిమ్‌లు, వర్కవుట్లు అంటూ కంగారుగా పరుగులు పెట్టడం సరికాదు. ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పు చేర్పులు చేయకుండా పొట్ట తగ్గించడం అసాధ్యం. ఆహారపు అలవాట్లు మార్చకుండా జిమ్‌లకు పరిగెడితే... అదనపు శారీరకశ్రమ వల్ల మనకు తెలీకుండానే మనం అదనంగా తింటాం. దాంతో పొట్ట తగ్గే అవకాశాలు మరింత తగ్గుతాయి. అందుకని ముందుగా పొట్ట పెరిగేందుకు దోహదం చేస్తున్న ఆహారాన్ని త్యజించాల్సిందే.
వ్యాయామం దిశగా...
అనంతరం బరువు చెక్ చేసుకుంటే ఎంతోకొంత మార్పు తప్పకుండా కన్పడుతుంది. అలా కనపడితేనే మనం ఖచ్చితమైన దారిలో వెళుతున్నట్టు. బరువు తగ్గినట్టు తెలిశాక... అవసరమైన షూస్, తగిన డ్రెస్ సిద్ధం చేసుకుని వాకింగ్ మొదలు పెట్టాలి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం 20నిమిషాలు తరువాత దశలవారీగా దాన్ని 40-60నిమిషాల దాకా తీసుకెళ్ళాలి. సాధారణ వాకింగ్ 2 వారాల పాటు మానకుండా చేశాక బ్రిస్క్‌వాకింగ్ మొదలు పెట్టాలి. ఆ తర్వాత వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్ కలిపి చేయాలి. మరో 2 వారాలు గడిచాక నిపుణుల పర్యవేక్షణలో అబ్డామినల్ క్రంచెస్ ప్రారంభించాలి. వీటిలో విభిన్న రకాలున్నాయి. వీటిలో నుంచి అనువైనవి ఎంచుకుని సాధన చేయాలి. వీటితో పాటుగా సైడ్ బెండ్స్, యోగాసనాలు, లైట్ వెయిట్స్తో స్ట్రెంగ్త్ ట్రయినింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి కూడా వీలునిబట్టి అపుడపుడు జత చేస్తుండాలి. రోజుకి 30నిమిషాలతో ప్రారంభించి గంట, గంటన్నర దాకా సమయాన్ని పెంచాలి. ఇలా 3 నెలలు చేశాక పొట్ట ప్రాంతంలో వచ్చిన మార్పుని, బరువు పరంగా వచ్చిన ఫలితాల్ని బేరీజు వేసుకోవాలి. వాటిపై నిపుణులతో చర్చించి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎక్సర్సైజ్ రొటీన్లో అవసరమైన మార్పు చేర్పులు చేసుకోవాలి.
గమనించాల్సినవి...
శరవేగంగా మార్పును ఆశించవద్దు. అలాగే మొదట్లోలాగే త్వరగా బరువు తగ్గుతామని అనుకోవద్దు. లేదా కృత్రిమ పద్ధతుల్లో తగ్గించేసుకోవాలని ఆరాటం వద్దు. ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులను కొనసాగిస్తూ, వ్యాయామం చేస్తుంటే నిదానంగా పొట్ట కరగడం ప్రారంభిస్తుంది. అయితే ఒకసారి కరిగిన పొట్ట తిరిగి రాకుండా శారీరక శ్రమని దినచర్యలో భాగం చేయడం అవసరం. లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కి దిగడం, చిన్న చిన్న దూరాలకు నడిచి వెళుతుండడం, ఆఫీసు, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే శరీరం కదిలేలా చలాకీగా పనులు నిర్వర్తిస్తుండడం... వంటివి చేస్తూ... పొట్ట తగ్గడం వల్ల మీరెంత చలాకీగా మారామనేది తెలుసుకుంటూ, చెప్పకనే చెప్పాలి. పొట్ట తగ్గిపోయాక కూడా వ్యాయామాన్ని కొనసాగిస్తూ పోతే... ఇక భవిష్యత్తులో ఉదరభాగంలో ఫ్యాట్ అనే ప్రమాదం రాదు. అంతేకాకుండా మంచి బాడీషేప్ కూడా స్వంతం అవుతుంది.
- ఎస్.సత్యబాబు
పొట్ట పెరిగేందుకు దోహదం చేసే ఆహారం
ముఖ్యంగా తెల్లని బియ్యం కారణంగా ఉదరభాగం ఉబ్బుగా మారే అవకాశాలు బాగా ఎక్కువ. కాబట్టి దానికి బదులుగా గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్ర బియ్యం... వంటివి వాడడం మొదలు పెట్టాలి. చిన్న చిన్న పరిమాణాలలో పలు దఫాలుగా ఆహారం తీసుకునే వేళలు సవరించుకోవాలి. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కాస్త ఎక్కువగా తీసుకున్నా పర్లేదు. అక్కడి నుంచి తగ్గిస్తూ వెళ్ళాలి. రాత్రి 7-8గంటల లోపు తినే కార్యక్రమం ముగించడం అవసరం. అలాగే నిద్రపోయే వేళలు కూడా వీలున్నంత వరకూ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కనీసం 6 వారాల పాటు ఖచ్చితంగా పాటించాలి.
పొట్ట భాగంలో కొవ్వు కరగడానికి, కండరాలు మంచి షేప్ తిరగడానికి యాబ్స్ ఎక్సర్సైజ్లు, క్రంచెస్ మాత్రమే మార్గం అనుకుని వాటికే పరిమితం కాకూడదు. అబ్డామినల్ వ్యాయామాలలో విభిన్న రకాలను సాధన చేయాలి. అలాగే వెల్లకిలా పడుకుని చేసే బైసికిల్ ఎక్సర్సైజ్ను అత్యుత్తమమైనదిగా అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ నిర్థారించింది. ది ప్లాంక్ (పుషప్ చేయడానికి చేతులు నేలకు ఆన్చి అదే భంగిమలో నిశ్చలంగా ఉండిపోయే వర్కవుట్) అనే వెరైటీ వ్యాయామం కూడా పొట్ట భాగాన్ని చదును చేసేందుకు చక్కని మార్గం.
- కుల్దీప్సేథీ, ఫిట్నెస్ ట్రైనర్.